హైదరాబాద్, మార్చి 10,
గతంలో ఫోన్ పోతే ఇంక అంతే సంగతులు. తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సి వచ్చేది. ఇంకో కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఆ బాధ తప్పింది. ఫోన్ పోగొట్టుకున్నా సరే పోలీసులు వెదికి తెచ్చి ఓనర్లకు అప్పగిస్తున్నారు. ఈ ఏడాది కాలంలోనే హైదరాబాద్ పోలీసులు ఏకంగా 500 ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకుని వాటిని తిరిగి ఓనర్లకు అప్పగించారు.పోగొట్టుకున్న ఫోన్లను వెదికి పెట్టమని కోరుతూ పౌరులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. హాక్ ఐ అనే యాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు. ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు ఆ ఫోన్ ను ట్రాక్ చేస్తారు. అది స్విచాఫ్‌లో ఉన్నా సరే.. ఎప్పుడో ఒకప్పుడు అందులో సిమ్ వేసి వాడుతారు కదా.. కనుక వారి లొకేషన్ సులభంగా తెలిసిపోతుంది. దీంతో ఫోన్ ను ట్రేస్ చేసి వెదికి పట్టుకుంటారు. తరువాత ఓనర్లకు అప్పగిస్తారు.అయితే ఫోన్‌ను కోల్పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే వెంటనే ఫోన్‌ను ట్రేస్ చేసి పట్టుకునేందుకు వీలు కలుగుతుంది. ఇక పోయిన ఫోన్లను ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ ప్రాంతాలకు తీసుకెళ్లి వాడితే వాటిని ట్రేస్ చేయడం కొంత కష్టంగా మారుతుంది. కానీ ఫోన్‌ను ట్రేస్ చేసి వెదికి తెస్తే మాత్రం ఓనర్లు ఆ ఫోన్‌ను కొనుగోలు చేసిన రశీదు లేదా దాని బాక్స్‌ను చూపించాల్సి ఉంటుంది. అప్పుడే పోలీసులు వివరాలను తనిఖీ చేసి తిరిగి ఫోన్‌ను అప్పగిస్తారు.ఇక హాక్ ఐ యాప్ ద్వారా ఇంకో సౌలభ్యం కూడా ఉంది. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొంటే మోసపోయేందుకు అవకాశం ఉంటుంది. దొంగిలించిన ఫోన్లను ఎవరైన అమ్మేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొనుగోలుదారులు ఆ ఫోన్‌కు చెందిన ఐఎంఈఐ నంబర్‌ను ఆ యాప్‌లో ఎంటర్ చేసి తనిఖీ చేయాలి. ఒక వేళ ఆ ఫోన్ దొంగిలించబడి ఉంటే, ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే వెంటనే ఆ యాప్ లో తెలిసిపోతుంది. దీంతో ఆ ఫోన్‌ను కొనకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఆ వివరాలను పోలీసులకు తెలియజేస్తే వారు ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఓనర్‌కు అప్పగిస్తారు. ఇలా హాక్ ఐ ఉపయోగపడుతుంది.