నిజామాబాద్, మార్చి 10,
నిజామాబాద్ నగరంలోని సాయినగర్‌లో 300 గజాల స్థలం టీఆర్‌ఎస్‌లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అనుచరుడు కదా అని అందలం ఎక్కిస్తే.. ప్రజల్లో పరువు తీస్తున్నాడని మేయర్ భర్త తీరుపై లబోదిబోమంటున్నారట ఎమ్మెల్యేలు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్ గుప్తలకు మేయర్ దండు నీతు భర్త శేఖర్ తీరు మింగుడుపడటం లేదట.ఆ మధ్య నిజామబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చినప్పుడు.. భూ వివాదాల విషయంలో మేయర్ భర్తను గట్టిగానే హెచ్చరించారు. కానీ శేఖర్ తీరు మారక.. ఇప్పుడు రోడ్డెక్కడంతో అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియక కలవర పడుతున్నారట ఎమ్మెల్యేలు. పైగా ఈ వివవాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి అల్లుడు సంపత్ పేరు ప్రస్తావనకు రావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది.వివాదానికి కారణమైన వ్యక్తులను కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేష్‌గుప్తా. చివరకు దండు శేఖర్‌పై అసహనం వ్యక్తం చేసి.. దూకుడు తగ్గించాలని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సమస్య రోడ్డెక్కి రచ్చ కావడంతో విషయాన్ని టీఆర్‌ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యేలు. గతంలోనే ఎమ్మెల్సీ కవిత హెచ్చరించి ఉండటంతో.. తాజా రగడ పార్టీ సీనియర్ల మధ్య కొత్త వివాదాలు తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారట.మేయర్ భర్త విషయంలో అంతిమ నిర్ణయం టీఆర్ఎస్ హైకమాండ్‌కు వదిలేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆలస్యమైందని.. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరమని ఎమ్మెల్యేలు సూచించారట. నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌పై భూ వివాదాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి పెట్టారట అధికారపార్టీ నేతలు. దీంతో మేయర్ భర్త గురించి తెలిసినా.. MLAలు చేతులు కాలకా ఆకులు పట్టుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. మరి.. పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.