అమరావతి
వ్యక్తుల ఆలోచన విధానమే జీవన గమన నాణ్యతలో కీలకపాత్రను పోషిస్తుందని, విద్య మనస్సును సన్మార్గంలో ఆలోచింపచేసేలా చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విమర్శనాత్మక ఆలోచన మన నిర్ణయాలను ప్రశ్నించుకోవటానికి, మనం మనచుట్టూ ఉన్న వ్యక్తులను నిష్పక్షపాతంగా చూడటానికి సహాయపడుతుందన్నారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవం గురువారం అనంతపురం వేదికగా జరగగా, కులపతి హోదాలో గవర్నర్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్ లైన్ విధానంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ సమగ్ర విద్య మంచి ఆలోచనలను పెంపొందించటానికి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని సాధించటానికి అనుమతిస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలు విద్యార్ధులకు వత్తిడి రహిత, సురక్షితమైన ప్రాంతాల వంటివని అభ్యాసం ముగించుకుని వాస్తవ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. విజయం, పురోగతి సులభంగా సమకూరేవి కాదన్న గవర్నర్ వాటిని సాధించటానికి వేసే తొలి అడుగు సైతం కష్టతరంగానే ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
విశ్వవిద్యాలయం నుండి బయటకు అడుగు పెడుతున్న తరుణంలో సాగే జీవన పోరాటంలో ప్రతిదీ విలువైనదే అవుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడానికి సంసిద్దులు కావాలన్నారు. స్నాతకోత్సవం ద్వారా పట్టాలు పొందిన ప్రతి విద్యార్ధి తమ వృత్తిలో ఎదగడానికి, జాతి అభివృద్ధికి దోహదపడటానికి తమ నైపుణ్యాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మీరు ఎంచుకున్న వృత్తిలో విజయం సాధించడానికి అవసరమైన నిబద్ధత, సృజనాత్మకత, ప్రతిభను విశ్వవిద్యాలయం అందించిందని, కష్టపడి సంపాదించిన జ్ఞానం మీ జీవితాన్ని సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నానని గవర్నర్ అన్నారు. వెనకబడిన ప్రాంతాన్ని విద్యాపరమైన పురోభివృద్ది ద్వారా ముందుకు నడిపించే క్రమంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆవిరళ కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న డా.అర్జుల రామచంద్రారెడ్డి అభినందనీయులని, జన్యుశాస్త్రం, వృక్ష శాస్త్రం, బయోటెక్నాలజీ రంగాలలో ఆయన చేసిన పరిశోధనలు భావితరాలకు ఉపయుక్తమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం-2020 విద్యా వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణలకు మార్గం చూపుతుందని, ఈ క్రమంలో నేటి తరం విద్యార్థులు నిజంగా అదృష్టవంతులని గవర్నర్ అన్నారు. ఇది భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.
యువతరం మంచి నైతిక పునాదిని కలిగి ఉండేలా తీర్చిదిద్దడంలో సహాయపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి యొక్క విశిష్ట సామర్థ్యాలను గుర్తించి వాటిని పెంపొందించడం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను చైతన్యపరచడం ద్వారా ప్రతి విద్యార్థి యొక్క అకడమిక్, నాన్-అకడమిక్ రంగాలలో సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం నూతన విధానంలో సాధ్యపడుతుందన్నారు. నూతన పాలసీకి అనుగుణంగా, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరం నుండి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టటం అభినందనీయమన్నారు. గవర్నర్ తో రాజ్ భవన్ నుండి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం మేరకు విద్యావ్యవస్దలో సమూలమార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి అచార్య ఎం.రామకృష్ణారెడ్డి అనంతపురం నుండి స్వాగతోపన్యాసం చేసి , వార్షిక నివేదికను అందించారు. రాజ్ భవన్ లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పాల్గొనగా, అచార్య మునినారాయణప్ప, డాక్టర్ రామ్ గోపాల్ తదితరులు గవర్నర్ కు శాలువా అందించి మెమొంటో బహుకరించారు.