హైదరాబాద్, మార్చి 10,
యూపీని గెలిచింది. దేశాన్ని గెలిచినట్టే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ హవా కంటిన్యూ అయినట్టే.. అంటున్నారు. యూపీలో బీజేపీ ఈ రేంజ్‌లో గెలవడం అనూహ్యమే. కరోనా కాలంలో తీవ్రంగా ఇబ్బందిపడిన మెజార్టీ వలస కూలీలు యూపీకి చెందిన వారే. అయినా, బీజేపీకే అందలం. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనల ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అంటే, పంజాబ్ మినహా.. మోదీని-బీజేపీని ఉత్తరాది ఓటర్లు ఆదరించినట్టేగా? ఉత్తర ప్రదేశ్‌లో ఎవరు గెలిస్తే.. వారిదే ఢిల్లీ సింహాసనం అంటారు. ఎందుకంటే, యూపీలో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి మరి. ప్రస్తుత అసెంబ్లీ ఫలితాలు చూస్తుంటే.. మరో రెండేళ్ల తర్వాత కూడా యూపీలో బీజేపీకి ఢోకా లేకపోవచ్చని అంటున్నారు. యూపీ సరే.. ఇక వాట్ నెక్ట్స్? సౌత్ సంగతేంటి? అనే చర్చ అప్పుడే మొదలైపోయింది. మా నెక్ట్స్ టార్గెట్ తెలుగు స్టేట్స్ అంటూ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి సవాల్ కూడా విసిరారు. అవును, నిజమే. బీజేపీ తదుపరి లక్ష్యం ఏపీ, తెలంగాణనే అనడంలో సందేహం అవసరం లేదేమో. ఎందుకంటే.. ఉత్తరాధి పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను తొలగించుకునేందుకు కమలం పార్టీ ఎప్పటి నుంచో గట్టిగా ట్రై చేస్తోంది. కానీ, కర్ణాటక మినహా సౌత్‌లో అది సాధ్యపడటం లేదు. కేరళలో కాలు కూడా మోపలేకపోతోంది. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు పాతుకుపోయి ఉన్నాయి. ఇక బీజేపీకి సౌత్‌లో కాస్తో కూస్తో ఆసక్తి, ఆదరణ ఉన్న రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే. తెలంగాణలో ఇప్పటికే కమలనాథులు దూకుడు మీదున్నారు. వచ్చే ఎన్నికల్లోనే అధికారం చేపడతామంటూ ఢంకా బజాయిస్తున్నారు. బండి సంజయ్ నాయకత్వంలో కమలదళం.. కేసీఆర్‌పై దండయాత్ర చేస్తోంది. ఈటల చేరికతో మరింత బలం పెరిగింది. త్వరలోనే సీబీఐ, ఈడీ రైడ్స్‌తో కేసీఆర్ ఖేల్ ఖతం చేస్తామంటోంది. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఒక్కడే కమలం జైత్రయాత్రకు ఉన్న స్పీడ్ బ్రేకర్. కేసీఆర్‌ను పడగొట్టడం ఈజీనేమో కానీ.. ప్రస్తుతానికైతే రేవంత్-కాంగ్రెస్‌ను ఢీ కొట్టడం కాస్త కష్టమే. అయితే, అసలు తమ పోటీ కాంగ్రెస్‌తో కానేకాదని.. టీఆర్ఎస్-కేసీఆర్‌లే తమ టార్గెట్ అన్నట్టు కమలనాథులు దూసుకుపోతున్నారు. అయితే, నోరున్న లీడర్లు ఉన్నా.. ప్రజల్లో బీజేపీపై ఆకర్షణ, ఆసక్తి ఉన్నా.. అది ఓట్లుగా మలుచుకోవడం.. గెలుపు దిశగా చివరికంటూ నిలవడం.. అంత ఈజీ మాత్రం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. బీజేపీకి తెలంగాణలో 119 స్థానాల్లో బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు. చివరి నిమిషంలో పక్క పార్టీల నుంచి గోడ దూకి వచ్చే నేతలకు టికెట్ ఇచ్చే కల్చర్ కాషాయం పార్టీది. అలాంటి పార్టీ సంస్థాగత లోటుపాట్లను సవరించుకుంటే.. ఈసారి కాకపోయినా వచ్చే సారికైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. కమలనాథులు మాత్రం ఈసారి కేసీఆర్‌ను కొట్టడం.. తెలంగాణలో గెలవడం పక్కా అని ధీమాగా చెబుతున్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో సీన్ పూర్తి రివర్స్. ఏపీలో అధికార పార్టీతో అంటకాగుతోంది బీజేపీ అనే విమర్శ ఉంది. జగన్‌రెడ్డి అంటే కసితో రగిలిపోతున్న జనసేనానితో స్నేహం చేస్తూనే.. అదే జగన్‌తో రహస్య స్నేహం నడిపిస్తున్నారు ఏపీ బీజేపీ పెద్దలు. వైసీపీపై పోరాటానికి బదులు.. ప్రతిపక్ష టీడీపీతోనే కయ్యానికి కాలుదున్నే స్వభావం కమలనాథులది. సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి, జీవీఎల్‌లాంటి వాళ్లు జగన్‌తో సానుభూతితో ఉన్నారని.. ఫ్రెండ్లీ ఫైటింగ్ చేస్తుంటారని అందరికీ తెలిసిందే. అమరావతి ఉదంతం నుంచి.. మూడు రాజధానుల యవ్వారం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకూ.. కేంద్రం-బీజేపీ ఆంధ్రుల విషయంలో మొదటి నుంచీ అన్యాయంగానే ప్రవర్తిస్తోంది. పైగా అరాచక వైసీపీ పాలనకు అండగా నిలుస్తోందనే ఆరోపణ కూడా ఉంది. అడ్డగోలు అప్పులకు సహకరిస్తూ.. జగన్‌ను మోదీ కన్నబిడ్డలా చూసుకుంటున్నారంటూ స్వయానా ఆర్థికమంత్రి నిర్మలమ్మే సెలవియ్యడం అందుకు నిదర్శనం. సో.. ఎలా చూసినా.. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదిగే ఉద్దేశ్యం మాత్రం లేనట్టే ఉంది. జనసేనకు కటీఫ్ చెప్పేసి.. పవన్ కల్యాణ్‌తో తెగదెంపులు చేసుకొని.. ఇవాళో, రేపో జగన్‌రెడ్డితో దోస్తానాకి.. వైసీపీతో అఫీసియల్‌గా అంటకాగేందుకు.. కమలం పార్టీ సిద్దమవుతోందని టాక్. జగన్-వైసీపీతో మైత్రితో ఏపీలో పాగా వేయాలనేది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది.
మరి, తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ రైడ్స్ చేయించేందుకు ఉత్సాహం చూపుతున్న కమలదళం.. అదే ఏపీ సీఎం జగన్ మెడకు ఉచ్చులా బిగుసుకున్నా సీబీఐ, ఈడీ కేసులను కాస్త మెలేస్తే సరిపోతుందిగా? చాలా సింపుల్ సొల్యూషన్‌గా! అలా చేయకుండా జగన్‌రెడ్డిని సేవ్ చేస్తూ.. కేసీఆర్‌పై కాలుదువ్వుతూ.. తెలంగాణలో ఇలా.. ఏపీలో అలా.. బీజేపీ ఎందుకలా?