జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో ఆ పార్టీ ఆవిర్భావ సభ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికపై నుంచి జనసేనాని పవన్ కల్యాణ్.. ఏం మాట్లాడతారు.. ఎవరిని టార్గెట్ చేస్తారనే చర్చ అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా వైరల్ అవుతోంది. గతేడాద రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ సందర్బంగా జగన్ ప్రభుత్వాన్ని పవన్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నటుడు పోసాని, అనంతరం కొడాలి నాని, పేర్ని నాని ఎక్స్ ట్రా ఎక్స్ ట్రా మంత్రులంతా రంగంలోకి దిగి.. పవన్‌పై విమర్శలు గుప్పించారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకార సభ జరిగింది. ఈ సభలో కూడా సీఎం జగన్ వ్యవహార శైలిపై పవన్ కల్యాణ్ పలు పంచ్‌లు విసిరిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా జరగనున్న ఈ ఆవిర్భావ సభ వేదికపై నుంచి మళ్లీ సీఎం జగన్‌ను పవన్ కల్యాణ్ టార్గెట్‌గా చేసుకునే అవకాశం లేకపోలేదని సమాచారం. గతంలో ఓ సారి మంగళగిరిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి నాటి టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అదే విధంగా.. అదే స్టైల్‌లో ఈ సభ వేదిక ద్వారా జగన్ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్.. చీల్చి చెండాడతారని తెలుస్తోంది. సరైన సమయంలో సరైన వేదిక మీద నుంచి తన ప్రత్యర్థులను తన మాటల తూటాలతో గురి చూసి కొట్టడంలో పవన్ కల్యాణ్ ముందుంటారని ఆయన ఫ్యాన్సే చెబుతోంటారు. జగన్ పరిపాలనలో లోటు పాట్లు చాలానే ఉన్నాయి. సీఎం కాకముందు వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకా హత్య నుంచి నిన్న మొన్నటి వరకు అంటే సీఎం జగన్ బావా, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్.. విజయవాడలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, క్రిస్టియన్లు, ముస్లిం, మైనారిటీలతో భేటీ వరకు అన్ని విషయాల్లో కొన్నింటిని అంటే .. మూడు రాజధాలు, రాజధాని అమరావతి, డీజీపీ సవాంగ్ బదిలీ, పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడ.. తదితర కీలక అంశాలను పవన్ కల్యాణ్ ఎంచుకుని.. మరీ జగన్ పార్టీని టార్గెట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. అలాగే సీఎం జగన్‌తోపాటు ఆయన కేబినెట్ మంత్రుల ప్రతిభాపాటవాలను కూడా పవన్ ఈ సందర్బంగా వెలికి తీస్తారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ సారి పవర్ స్టార్ స్పీచ్.. చాలా పవర్ పుల్‌గా ఉంటుందనే టాక్ అయితే జనసేన పార్టీలో హాట్ హాట్‌గా నడుస్తోంది. అంతేకాదు.. జగన్ మూడేళ్ల పాలనపై పవన్ చేసే రివ్యూ ఈ స్పీచ్ ఇది.. అన్న ఆశ్చర్య పోనక్కర్లేదనే చర్చ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో నడుస్తోంది. మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సభ ఏర్పాట్లను ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ నిర్వహణకు జనసేన నేతలు ఫిబ్రవరి 28న ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కానీ సభ అనుమతికి తీవ్ర జాప్యం జరగడంతో.. జనసేన నేతలు ఒకానొక సందర్బంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంపై నాదెండ్ల మనోహర్ సందేహం వ్యక్తం చేశారు. ఈ సభకు అనుమతి ఇవ్వకుండా జగన్ ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందంటూ ఆయన ఆరోపణలు సైతం గుప్పించారు. ఆ దశలో ఈ సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించాలని నాదెండ్ల మనోహర్ నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకుని.. మరో సారి హైకోర్టుతో మొట్టికాయలు ఎందుకనో ఏమో ఈ సభకు కొవిడ్ షరతులతో అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్.. జగన్ పార్టీకి పంటికింద రాయిలా తయారయ్యాడనే చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో చాలా కాలంగా నడుస్తోంది. ఆ క్రమంలోనే నాటి నుంచి నేటి వరకు పవర్ స్టార్‌ను టార్గెట్‌గా చేసుకుని సీఎం జగన్ ఏదో ఓ విధంగా ఆయనకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ జగన్ మెండి అయితే.. పవన్ కల్యాణ్ జగ మొండి అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. సీఎం జగన్‌పై నేరుగా విమర్శలు చేయగల సత్తా ఉన్న ఒకే ఒక్కడు పవన్ కల్యాణ్ అనే టాక్ టాలీవుడ్‌లో సైతం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల నాటి నుంచి.. తాజాగా పవన్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే సినిమా టికెట్ల ధరల పెంపుపై టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు.. సీఎం జగన్‌ను కలిసి విన్నవించారు. కానీ సినిమా టికెట్ల ధరలు పెంపునకు సంబంధించిన జీవోలు ఆ వెంటనే సీఎం జగన్ విడుదల చేయకపోవడం గమనార్హం. కానీ సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన జీవోను చాలా రోజుల క్రితమే సీఎం జగన్ సవరించారని.. కానీ పవన్ సినిమా విడుదల తర్వాతనే ఈ జీవోను బయటకు వదిలారనే టాక్ అయితే అమరావతిలో వైరల్ అవుతోంది. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు ముందే తెలుసునని.. తన సినిమా విడుదల అయితేనే కానీ.. సినిమా టికెట్ల ధరల పెంపు జీవో విడుదల కాదని ఆయనే స్వయంగా తన ముఖ్యులతో చెప్పారనే టాక్ కూడా ఫిలింనగర్‌లో చక్కెర్లు కొడుతోంది. అ క్రమంలోనే పవన్ అన్నిటికీ సిద్ధపడి... భీమ్లా నాయిక్ సినిమా విడుదల చేయించారని సమాచారం. అంతేకాకుండా తన భీమ్లా నాయక్ సినిమా వల్ల మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఎదురైనా.. మీకు అండగా నిలబడేందుకు తాను సిద్ధమని పంపిణిదారులతో పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పి.. వారికి భరోసా ఇచ్చారని తెలుస్తోంది. ఇంత జరిగిన తర్వాత పవన్ కల్యాణ్.. ఉరుకుంటాడా. ఆయన తిక్కకు ఓ లెక్క ఉంది. ఆ లెక్క ఎంత అనేది.. ఈ ఆవిర్భావ సభ సాక్షిగా సీఎం జగన్‌కు తెలుస్తోంది అనే టాక్ అయితే పవన్ ఫ్యాన్స్‌లో గట్టిగా నడుస్తోంది.