పర్చూరు పట్టు సడలిపోకుండా ఉండేందుకు వారసుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌ను రంగంలోకి దించుతారా... 2019 ఎన్నికల్లో వైసిపి నుంచి దగ్గుబాటి హితేష్‌కు టిక్కెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నా అడ్డుతగిలిన అమెరికా పౌరసత్వం సమస్య... ప్రస్తుతం ఆ సమస్య లేకపోవడంతో పాటు వైసిపికి దగ్గుబాటి ఫ్యామిలీ దూరం కావడంతో ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్న సందిగ్దం... ఇటీవల సంక్రాంతికి పురందేశ్వరి సోదరుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్చూరులో సోదరి ఇంట్లో మూడురోజులు మకాం వేసి హడావిడి చేయడంతో టిడిపి టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి... ఈసారైనా దగ్గుబాటి హితేష్ రాజకీయ ఆరంగ్రేట్రం టిడిపి నుంచి ప్రారంభమవుతుందా...రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు. నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎన్‌టిఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి, చిన్న అల్లుడు నారా చంద్రబాబు మొదట ఎడమొహం పెడ మొహంగా ఉన్నా, తరువాత మామను గద్దె దింపడానికి కలిసారు. మళ్లీ ఆ పై విడిపోయారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు, పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరారు... ఆ తరువాత క్రమంలో పురందేశ్వరి బిజెపిలో చేరి ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు... అయితే వెంకటేశ్వరరావు మాత్రం 2019 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరి పర్చూరు నుంచి పోటీ చేసి తొలిసారి ఓడిపోయారు... తొలిసారి ఓటమి పాలయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసిపిలో సరైన ప్రాధాన్యం లేకపోవడంతో పాటు భార్య పురందేశ్వరి బిజెపిలో ఉంటూ వైసిపి పాలనపై తీవ్ర విమర్శలు చేయడం వెంకటేశ్వరరావుకు వైసిపిలో గడ్డు పరిస్థితులు తలెత్తేలా చేశారు... దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపికి కూడా దూరమయ్యారు... రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు.2009 ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ టిడిపి తరపున ఎన్నికల ప్రచారానికి కారంచేడు వెళ్లి, అక్కడ అక్క-బావ ఇంటి ముందు తొడ కొట్టి సవాల్ విసిరారు... ప్రస్తుతం అక్క బిజెపిలో, తమ్ముడు టిడిపిలో వున్నారు. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పురందేశ్వరికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పోటీ చేసిన చోట గెలుపు దక్కలేదు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ నైరాశ్యంలో ఉన్నారు.ఇలాంటి సమయంలో పురందేశ్వరి సోదరుడు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి కారంచేడులోని అక్క పురందేశ్వరి ఇంటికి వచ్చారు. ముచ్చటగా మూడురోజులు అక్క, బావలతో సరదాగా గడిపారు. మేనల్లుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌తో సరదగా కబుర్లు చెప్పుకున్నారు... సాధారణంగా బాలకృష్ణ తన రెండో బావ చంద్రబాబు స్వగ్రామం కుప్పం వెళ్తారు. కానీ ఈసారి బాలయ్య కారంచేడు వచ్చారు... అంతా ఏదో కార్యార్ది అయి వచ్చాడనుకుని గుసగుసలాడుకున్నారు... వైయస్ జగన్ ను ఎదుర్కోవడానికి వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావాలనే ప్రయత్నాలు బలంగా ప్రారంభించడానికేనన్న ఊహాగానాలు వినిపించాయి...పర్చూరు నియోజకవర్గంలో గత ముఫైఐదేళ్ళుగా తిరుగులేని నేతగా ఉన్న ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ప్రస్తుత రాజకీయాలు మింగుడు పడలేదు...నిన్నటి వరకు ఓటమి ఎరుగని నేతగా ఉన్న దగ్గుబాటి 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవి చూశారు. గత ఎన్నికలకు ముందు తన కొడుకు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌తో కలిసి వైసిపి పార్టీలో చేరారు. జూనియర్ దగ్గుబాటికి ఈసారి పర్చూరు నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసేందుకు ప్రయత్నించి చివరి నిమిషయంలో హితేష్ చెంచురామ్‌కు భారత పౌరసత్వం సమస్య రావడంతో మళ్ళీ తానే పర్చూరు నుంచి పోటీ చేయాల్చి వచ్చింది. అయితే అనూహ్యంగా ఈసారి దగ్డుబాటి పర్చూరులో ఓడిపోయారు. ఆ తరువాత క్రమంలో వైసిపికి దగ్గుబాటి గుడ్‌బై చెప్పేశారు... అయితే దగ్గుబాటి కుటుంబం రాజకీయ వారసుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌ను రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు ఈసారి ఎన్నికలను వేదికగా చేసుకున్నారని చెప్పుకుంటున్నారు... వైసిపిలో మళ్ళీ అవకాశం వచ్చేలా లేదు... దీంతో టిడిపిలో పోటీ చేయాలంటే చంద్రబాబు ఆమోదం కావాలి... మరి చంద్రబాబు ఆమోదం కావాలంటే ఆయనకు, తనకు బావమరిది బాలకృష్ణ రంగంలోకి దిగితే బాగుంటుందన్న అభిప్రాయాలు నందమూరి కుటుంబంలో వినిపించాయట... అందుకే బాలకృష్ణ ఈసారి కారంచేడులోని తన అక్క, బావల ఇంటికి వచ్చి మేనల్లుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ రాజకీయ ఆరంగేట్రంకు రంగం సిద్దం చేసినట్టు భావిస్తున్నారు... చీరాలలో టిడిపి బలహీనంగా ఉండటంతో అక్కడి నుంచి హితేష్‌ను పోటీ చేయించేందుకు పార్టీ అధిష్గానంతో బాలకృష్ణ మంతనాలు చేస్తున్నట్టు వినికిడి... అందుకు చంద్రబాబు, లోకేష్‌లు కూడా సుముఖంగానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు... దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి టిడిపి టికెట్‌పై దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది... ఇదే నిజమైతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనడానికి ఇదే నిదర్శనం.