విజయవాడ, మార్చి 12,
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. అధికారులకు సమాచారం రావటంతో ఎక్కడికక్కడే దాడులు చేస్తున్నారు. అధిక ధరలకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కేటుగాళ్ళు ప్రజల డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు. కర్నూలు జిల్లాలో ఆయిల్ ధరలు పెంచి, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫిర్యాదులు రావడంతో ఆదోని ,ఆత్మకూరులో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. సన్‌ఫ్లవర్ అయిల్స్‌ను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టారు. దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో కొన్నిచోట్ల షాపులకు తాళాలు వేశారు వ్యాపారస్తులుకడప జిల్లాలో ఆయిల్ మిల్లులు, హోల్‌సేల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ప్రొద్దుటూరులో వంటనూనె ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనికీలు నిర్వహించారు. అసలు ధర కంటే ఎక్కువ రేటుకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.తూర్పుగోదావరి జిల్లాలో అధిక ధరలకు వంట నూనెలు అమ్ముతున్న పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమలాపురంలోని హోల్‌సేల్ దుకాణాల్లోనూ వంట నూనెల నిల్వలను పరిశీలించారు. వంట నూనెల ధరలు పెంచి అమ్ముతున్నారనే ఫిర్యాదులపై దర్యాప్తు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సాకుగా చూపి, ఆయిల్ వ్యాపారస్తులు భారీగా నిల్వ చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఎవరైనా వంట నూనె ధరలు పెంచి అమ్మితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.తిరుపతిలోనూ వంట నూనెలు అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి..అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇకపై నిరంతరం దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు విజిలెన్స్ అధికారులు. అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నెల్లూరు జిల్లాలోని ఆయిల్ వ్యాపారుల షాపులపై విజిలెన్స్ అధికారులు రైడ్ చేపట్టారు. వంట నూనెల ధరలు ఇష్టారాజ్యంగా పెంచడంతో పాటు నిత్యావసర వస్తువులను పెద్ద స్థాయిలో నిల్వ చేసారనే సమాచారం అందుకున్నారు అధికారులు. పలుచోట్ల సోదాలు చేపట్టిన అధికారులు షాపు యజమానుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి..రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సామాన్యులకు పెనుశాపంగా మారింది. వంట నూనెలతో పాటు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.