YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పాజిటివ్ ఓటుతో కమలం

పాజిటివ్ ఓటుతో కమలం

లక్నో, మార్చి 12,
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ సాధించిన విజయం.. బీజేపీ విజయం కాదు, విపక్షాల ఓటమి. నిజానికి, ఇప్పుడు కాదు, 2019 ఎన్నికలకు ముందునుంచే, విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, నేల విడిచి సాము చేయడం వల్లనే, విపక్షాలకు వరస ఓటములు ఎదురవుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశేషణలను జాగ్రత్తగా గమనిస్తే ఇదే విషయం మరోసారి రుజువవుతుంది. ఒకసారి వెనక్కి వెళితే, 2019 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రాలలో ఒకటి జీఎస్టీ, (దీన్నే రాహుల్ గాంధీ ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని ప్రచారం చేశారు). ఆలాగే, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో, అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఊరువాడా తిరిగి, ప్రధాని మోడీని ఉద్దేశించి, ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ  ప్రచారం చేశారు. ‘గబ్బర్ సింగ్ టాక్స్’, ‘చౌకీదార్ చోర్ హై’ స్లోగన్స్ క్యాచీగా ఉన్నాయి. కానీ, రాహుల్ ఒకటి తలిస్తే ప్రజలు ఇంకొకటి తలిచారు. అందుకే, వీటికి తోడు దేశంలో 20 శాతం వరకు ఉన్న నిరుపేద కుటుంబాలకు కనీసం ఏడాదికి రూ.72 వేలు అందేలా చర్యలు చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుని హోదాలో  రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినా, కాంగ్రెస్’నే కాదు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన పార్టీలను కుడా ప్రజలు తిరస్కరించారు. ఇక ప్రస్తుతంలోకి వస్తే.. ప్రతిపక్ష పార్టీలు ఏడాదికిపైగా సాగిన రైతుల ఆందోళన మీద ఆశలు పెట్టుకున్నాయి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జాట్ రైతులు విపక్షాలకు ఓటేసి గెలిపిస్తారని భావించారు. కానీ, జాట్’ ఓటు ప్రభావం ఎక్కువగా ఉన్న, ప్రాంతాల్లోనూ బీజేపీ.. ఎస్పీ కంటే ఎక్కువ సీట్లు గెలిచింది. అంతవరకు ఎందుకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారడు, ఆందోళన చేస్తున్న రైతులపైకి కారు ఎక్కిచి, నలుగురు రైతుల మరణానికి కారణం అయ్యారని, ఆరోపణలు ఉన్న లఖింపూర్ లోకసభ నియోజక వర్గం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాల్లో  బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. మంత్రి రాజీనామా చేయాలని, ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఈ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగానూ ఉపయోగించుకున్నారు, అయినా ఎనిమిదింట ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా ప్రధాన ప్రచార అస్తం, ఉన్నావ్ అత్యాచారం కేసు. అయినా ఆ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోనూ ఎనిమిదికి ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు.అలాగే, కొవిడ్ వేవ్ సమయంలో జరిగిన లోపాలనుమాత్రమే ప్రజలు చూస్తారని విపక్షాలు భావించాయి. కానీ, ప్రజలు సెకండ్ వేవ్ లోపాల కంటే మోడీ ప్రభుత్వం వాక్సినేషన్ విషయంలో సాధించిన అద్భుత విజయాలను చూసి ఓటేశారు. అలాగే, అన్నిటినీమించి, అఖిలేష్ యాదవ్ కేవలం కుల సమీకరణలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. కానీ, ఈ ఎన్నికలలో కులం కంటే మతం, ఎక్కువ పాత్ర పోషించింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాద్ ‘ ఇలా అని అలా వదిలేసిన 80:20 నినాదం మెజారిటీ మతస్తులపై మంత్రంలా పనిచేసింది. ఈ ఎన్నికల్లో ముస్లిం మహిళలు సహా , కులమతాలకు అతీతంగా మహిళలు బీజేపీకి జై కొట్టారు, ఉత్తర ప్రదేశ్’లో మహిళా ఓటర్లలో 48శాతం మంది బీజేపీకో ఓటేస్తే.. ఎస్పీకి 32శాతం మంది మాత్రమే ఓటేశారు. అంటే, ఎస్పీ కంటే 16 శాతం ఎక్కువ మంది మహిళలు బీజేపీకి ఓటేశారు. ఉత్తరాఖండ్’లోనూ కాంగ్రెస్ కంటే బీజేపీకి 14 శాతం ఎక్కువ మంది మహిళలు బీజేపీకి ఓటేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం, ట్రిపుల్ తలాక్, శాంతి భద్రతలు, మహిళా రక్షణ విషయంలో  యోగీ అడిద్యనాథ్ ప్రయోగించిన బుల్దోజర్ మంత్రం వంటి అంశాలు, కులాలతో సంబంధం లేకుండా చాప కిందనీరులా బీజేపీకి అనుకూలంగా మారాయి. అయితే ఈ వాస్తవాలను విపక్షాలు గుర్తించలేక పోయాయి. అంటే, విపక్షాలు, వాస్తవాలను వక్రీకరించి, నేల విడిచి  సాము చేయడం వరస ఓటములకు ప్రధాన కారణంగా భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Related Posts