హైదరాబాద్, మార్చి 12,
సిటీ శివారులో ఇండ్ల మధ్యన ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తామని రాష్ట్ర సర్కార్ప్రకటన చేసి ఏండ్లైనా ఆచరణలో చేసి చూపట్లేదు. దీంతో కాలుష్య పరిశ్రమల బాధ ఇంకెన్నాళ్లోనని జనాలు బతుకెళ్లదీస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన జీడిమెట్లలోనే సుమారు 100 వరకు ఫార్మా, బల్క్ డ్రగ్స్, ఇంటర్ మీడియటట్ కెమికల్ తయారీ కంపెనీలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలోని ఇతర ఇండస్ట్రియల్ ఎస్టేట్స్తో కలిపితే మొత్తం 500 వరకు ఉంటాయి. రాష్ట్రంలో ఫార్మా ఉత్పత్తుల్లో జీడిమెట్లది కీలక పాత్ర. ఇక్కడ ఇండస్ట్రియల్ఎస్టేట్స్థాపించక ముందు ఈ ప్రాంతం అడవి ప్రాంతంగా కనిపించేది. మౌలిక వసతులు లే క ఏదైనా అవసరం ఉంటే బాలానగర్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కాల క్రమేణా జీడిమెట్ల సిటీలో కలిసింది. బఫర్జోన్గా ఏర్పాటు చేయకపోవ డంతో పరిశ్రమలను ఆనుకునే కాలనీలు వెలిశాయి. దీంతో సమస్య మొదలైంది. ఎవరు ముందు వచ్చారనేది పక్కన పెడితే పరిశ్రమలతో జల, వాయు, శబ్ధ, భూ కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలానగర్, సనత్నగర్, గాంధీనగర్, ఉప్పల్తోపాటు బొల్లారం ఇలా ఇండస్ట్రియల్ ఎస్టేట్ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పరిశ్రమల ఓనర్ల తీరుతో ఇక్కడి జనాలు ఏండ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడి గాలి, నీరు కలుషితమవడంతో రోగాల బారినపడుతున్నారు. కొన్ని చోట్ల బోరుబావులు తవ్వితే ఎర్రని కలుషిత నీళ్లు వస్తున్నాయంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో తెలుస్తుంది. కాలుష్యం కారణంగా రాత్రిళ్లు కిటికీలు తెరవలేని పరిస్థితి. ఉదయం వాకింగ్కి వెళ్లలేని దుస్థితిలో జనాలు ఉన్నారు. ఇది సరిపోదన్నట్లు కొంత మంది కంపెనీల ఓనర్లు బోర్లు వేసి అందులోకి పంపిస్తున్నారు. మరికొంత మంది అడవుల్లో కెమికల్ డంపింగ్ చేస్తున్నారు. ఇలా ఒక్కో పరిశ్రమతో జనాలకు కష్టాలు వస్తున్నాయి. ఓ పరిశ్రమను ఏర్పాటు చేయడమంటే ఆషామాషీ కాదు. పూర్తిస్థాయిలో నడుస్తున్న ఒక పరిశ్రమను తరలించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉన్న పరిశ్రమను తరలిస్తే దాని విలువలో సుమారు 50శాతం నష్టపోవాల్సి వస్తుందని పరిశ్రమ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నష్టాన్ని తాము భరించి వెళ్లే చోట పూర్తిస్థాయి మౌలిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. విద్యుత్, నీరు, మ్యాన్పవర్ఇలా అన్ని వసతులు ఉంటేనే వెళ్లడానికి సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. అంటే అన్ని సౌకర్యాలతో ఓ ప్రాంతాన్ని చూపించిన తరువాతనే ఇక్కడి వారు వెళ్లడానికి సాధ్యమవుతుందని అర్థమవుతోంది. అంటే ఇలాంటి పరిస్థితులకు అనువైన ప్రదేశాలు ఎక్కడా కన్పించడంలేదు. దీనిని బట్టి చూస్తే కాలుష్యకారక పరిశ్రమలు తరలి వెళ్లడానికి మరికొన్నేండ్లు పట్టే అవకాశం ఉందని ప్రజలు , పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఫార్మా సిటీ లాంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి మౌలిక వసతులు కల్పిస్తే కాలుష్యకారక పరిశ్రమల తరలింపు సాధ్యమవుతుంది. అప్పటి వరకు కాలుష్యంతోనే బతకాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ లోపల ఇండ్ల మధ్య ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తామని చెప్పడంతో జనాలు సంతోషించారు. నెలలు, ఏండ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమను తరలించిన దాఖాలాలు లేవు. దీంతో ఎప్పటి లాగనే కాలుష్యంతో బతకాల్సిన దుస్థితి నెలకొంది. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ఎప్పుడు జరుగుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కొన్ని కాలుష్య కారక పరిశ్రమల కారణంగా కాలుష్యం నడుమ బతుకుతున్నాం. డాక్టర్లు సైతం గుర్తించలేని రోగాల బారిన పడుతున్నాం. జీడిమెట్లలో ఉంటాం అని బంధువులు,స్నేహితులకు ఎవరికైనా చెబితే జాలిగా చూస్తున్నారు. దశాబ్ధాలుగా కాలుష్యంతో జీవనం చేస్తున్నాం. కాలుష్య కారక కంపెనీలు తరలిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ఎంతో సంతోషించాం. ఐదేండ్లు గడిచినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. కనీసం మానవతా దృక్పథంతోనైనా ప్రభుత్వం పరిశ్రమలను వెంటనే తరలించాలి. - శ్రీనివాస్, జీడిమెట్ల