హైదరాబాద్ మార్చ్ 12
శివారు ప్రాంతాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి కేటీఆర్. రూ. 11 వేల కోట్లతో హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కొరకు ప్రభుత్వం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి(ఎస్ఎన్‌డీపీ) కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎస్ఎన్‌డీపీ కింద రూ. 985 కోట్ల 45 లక్షల వ్యయంతో మొత్తం 60 పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎస్ఎన్‌డీపీ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు హైదరాబాద్‌లో మూడు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించాం. ఎంసీహెచ్‌లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు లేవు. వరద నీటి కాల్వలు, మురికి నీటి కాల్వలు కలిసిపోయాయి. నాలాల మీద అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఎస్ఎన్‌డీపీ ద్వారా వరద నీరు, మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.జీహెచ్ఎంసీ ఏరియాలో రూ. 735 కోట్లతో, జీహెచ్ఎంసీ వెలుపల రూ. 250 కోట్లతో 60 పనులను చేపట్టామని చెప్పారు. ఈ పనులపై ప్రతి వారం తానే సమీక్షిస్తున్నానని తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి ఈ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ ఎస్ఎన్‌డీపీ పనుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు తిరిగి, ఫోటోలకు ఫోజులిచ్చారు.. కానీ నిధులు మాత్రం ఇవ్వలేదు. గుజరాత్‌కు మాత్రం రూ. వెయ్యి కోట్లు ఇచ్చారు. హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకపోవడం అనేది నిజంగా సిగ్గు పడాల్సిన విషయమన్నారు. హైదరాబాద్‌కు కేంద్ర పెద్దలు అర పైసా కూడా సాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కలుషిత నీటిని తాగి భోలక్‌పూర్‌లో 11 మంది మృతి చెందారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం మురికి నీరు, మంచి నీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.