విజయవాడ, మార్చి 14,
ఇంతవరకు, ఎందరో ఆశావహులు, వేయి కళ్ళతో, ముక్కోటి ఆశలతో ఎదురు చూస్తున్న సుముహూర్తం వచ్చేస్తోంది. అవును, ఎంతో కాలంగా ఊహగానాలకే పరిమితం అయిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ త్వరలోనే ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచే స్పష్టమైన సకేతాలు వచ్చేశాయి. పునర్ వ్యవస్థీకరణ విషయంలో ఇంతవరకు వాళ్ళూ వీళ్ళూ మాట్లాడడమే కానీ, ముఖ్యమంత్రి నోటి నుంఛి మాత్రం అలాంటి మాట ఎప్పుడూ రాలేదు. కానీ, ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో, స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పునర్ వ్యవస్థీకరణపై మౌనం వీడడమే కాదు, అందుకు సంబదించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులకోసం చాలా మంది పోటీలో ఉన్నారని చెప్పారు. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్లు కాదన్నారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరే అంటూ ముదస్తు బిస్కట్’ కూడా వేశారు. అంతే కాదు.. మంత్రివర్గంలో లేనివాళ్లు పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు.అంటే ప్రస్తుత మంత్రుల్ల్లో కొదరు త్వరలో మాజీలు కాబోతున్నారని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎంత మందికి ఉద్వాసన పలుకుతున్నారు, ఎవరెవరికి ఉద్వాసన పలుకుతున్నారు అనేది మాత్రం స్పష్టం కాలేదు. గత కొంత కాలంగా త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారుఅదలా ఉంటే ,గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తమ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారానే ప్రచారం అటు పార్టీ వర్గాల్లో, ఇటు మీడియా వర్గాల్లో వినవస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే, ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై దృష్టి పెడతారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఊగాదికి కొత్త జిల్లాలతోపాటుగా, కొత్త మంత్రి వర్గం కొలువు తీరడం ఖాయమని,అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన వెంటనే, పాత ముఖాలను పూర్తిగా పక్కన పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు, అయితే, తొలి రెండున్నర సంవత్సరాలలో ఎక్కువ కాలం, ‘కొవిడ్’ మింగేయడంతో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణను మరో ఆరు నెలలు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడవు కూడా ముగియడంతో ముఖ్యమంత్రి ముహూర్తం ఖరారు చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ముందు చెప్పినట్లుగా మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేసి ఆలోచన అయితే, ఇప్పుడు లేదని అంటున్నారు. ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా ఉన్న నేపధ్యంలో మేకపాటి మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడంతో పాటుగా స్వల్పమార్పులు చేర్పులతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తిచేస్తారని అంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హింట్’ను బట్టి చూసినా, స్వల్పమార్పులతో సరిపెట్టే ఆలోచనలోనే ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది.అదలా ఉంటే, ఇప్పటికే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లేజ్’ అంటూ ఆమె ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అ అంతటా కనిపిస్తూనే ఉన్నాయి. సరే, రోజాకు మంత్రి పదవి వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆదే స్థాయిలో మరో మహిళా ఎమ్మెల్యే, చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.