విజయవాడ, మార్చి 14,
ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం రాజధాని విషయంలో, అదే ‘పెడ’ధోరణి కొనసాగిస్తోందా? అంటే, అవుననే అనవలసి వస్తోంది. నిజానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక మూడు రాజధానుల విషయంలో, రాష్ట్ర హై కోర్టు, గట్టిగానే మొట్టికాయలు వేసింది. ‘మూడు’ మార్చుకోమని చెప్పింది. మూడు రాజధానుల చట్టం చేసే అధికారమే, ప్రభుత్వానికి /అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. అమరావతి ఒక్కటే రాష్ట్ర రాజధానని, ఇంకో మాట లేదని స్పష్టం చేసింది. అయినా, ప్రభుత్వం వైఖరిలో మార్పులేదు. నిజానికి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కూడా మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ వైఖరిలో మార్లు లేదని చెపుతూనే వచ్చారు.ఇప్పుడు, ప్రభుత్వం అదే పేద ధోరణి చేతల్లోనూ చూపించింది. కోర్టు ఆదేశాల ప్రకారం అమరావతి అభివృద్ధికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం కౌలు, పేదలకు పింఛను, బ్యాంకులకు వడ్డీ చెల్లింపులకు మాత్రమే నిధులు కేటాయించింది. అదేమంటే.. కేంద్రం నుంచి రూ. 8వందల కోట్లు వస్తాయంటూ పద్దుల్లో చూపించింది.బడ్జెట్’లో రాజధానికి చేసిన కేటాయింపులు గమనిస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను, బేఖాతరు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లే ఉందని, పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర హై కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ఆదేశాల అమలు చేసేందుకు న్యాయస్థానం ప్రభుత్వానికి నిర్దిష్ట గడువులు విధించింది. రాజధానిలో నెల రోజుల్లో మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేయాలని, 3 నెలల్లో రైతులకు లేఅవుట్‌లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించి 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనీ ప్రభుత్వానికి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా, ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులను బడ్జెట్’ లో కేటాయించలేదు. నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ముందుగా అమరావతి పనులు నిలిపివేసింది. ఆ తర్వాత కోర్టు కేసులను కారణంగా చూపి, అమరావతి అభివృద్ధిని అటకెక్కించింది. గడచిన రెండున్నర పైచిలుకు కాలంలో, అమరావతిలో తట్ట మట్టి ఎత్తింది లేదు, ఒక రూపాయి ఖర్చు చేసింది లేదు. అయినా, అమరావతి భూములను, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా కొద్ది పాటి పనులు చేపట్టిన ప్రభుత్వ ఉద్దేశం అమరావతి అభివృద్ధి కాదు, అనేది అందరికీ తెలిసిన రహస్యమే. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అయినా ప్రభుత్వం వైఖరి మారుతుందని అనుకుంటే, అదీ లేదు. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. బడ్డెట్ అంకెల్లో మాత్రం 1329.21 కోట్లు కేటాయించినట్టుగా చూపించి కనికట్టు చేసింది. అందులో రూ. 800 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని, గాలిలో దేపం వెలిగించింది.బడ్జెట్ కేటాయింపులను పట్టి చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధి చేసే ఆలోచన లేదనే విషయం మరో మారు స్పష్ట మైంది. అయితే, హై కోర్టు ధర్మాసనం ఎప్పటి కప్పుడు ప్రగతి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపధ్యంలో, ప్రభుత్వ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తుందా? ఉల్లంఘిస్తే న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అనేది చూడవలసి వుందని పరిశీలకులు అంటున్నారు.