హైదరాబాద్, మార్చి 14,
భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన క్షిపణి చేరనుంది. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పటివరకు 300 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను మాత్రమే చేధించగలదు. అయితే త్వరలోనే 800 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ శక్తివంతమైన క్షిపణిని గగనతలం నుంచి ప్రయోగించే విధంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాయి.ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన సంగతి తెలిసిందే. కమాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌స్పెక్షన్ (CASI) సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ నుంచి ప్రయోగించిన ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ మిస్‌ఫైర్ కాగా పాకిస్థాన్‌లో స్వల్ప ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.