YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ అంచనాలు తలక్రిందులు

కేసీఆర్ అంచనాలు తలక్రిందులు

హైదరాబాద్, మార్చి 14,
కేంద్రంపై, బీజేపీ సర్కార్ పై ప్రత్యక్ష యుద్ధానికి దిగిన తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ సీజ్ ఫైర్ అంటారా? జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ఆయన మళ్లీ కొంతకాలం ఆ ఊసు ఎత్తకుండా మౌనం పాటిస్తారా? 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా చెబుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా ఉత్తరప్రదేశ్, గోవా, మిజోరాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో కేసీఆర్ మళ్లీ సైలెంట్ అయిపోనున్నారా? అంటే అవుననే సమాధానాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు కేసీఆర్ అంచనాలను మరోసారి తలకిందులు చేశాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.నిజానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని కేసీఆర్ అంచనా వేసుకున్నారట. ఉత్తరాఖండ్, గోవాలో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవుతుందని ఊహాగానాలు చేశారట. ఒక వేళ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలిచినప్పటికీ బొటాబొటీ మెజార్టీయే వస్తుందని ఆయన లెక్కలు వేసుకున్నారట. ఎన్నికల అనంతరం మరింత స్పీడుగా చక్రం తిప్పుదామని కేసీఆర్ అనుకున్నారట. అయితే.. నాలుగు రాష్ట్రాల్లో తన అంచనాలకు వ్యతిరేకంగా బీజేపీ ఫలితాలు రావడంతో ఆయన కంగు తిన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు గమ్మున ఉండడమే మేలనే ధోరణిలోకి కేసీఆర్ వెళ్లారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.కేంద్రంపై గురిపెట్టడం కేసీఆర్ కు ఇది రెండోసారి. 2019 సార్వత్రిక ఎన్నకలకు ముందు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొన్నాళ్లు ప్రయత్నాలు కూడా చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో, మాజీ ప్రధాని జనతాదళ్ ఎస్ సుప్రీమో దేవెగౌడతో, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో మంతనాలు కూడా నడిపారు. అయితే.. వారి నుంచి కేసీఆర్ కు సరిగా స్పందన లభించలేదని అంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయే గెలిచి కేంద్రంలో అధికారంలో రావడంతో కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయంటారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు చేసిన కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. కాగా.. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ మరోసారి కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి అంటూ పర్యటనలు కొనసాగిస్తారా?లేక 2019లో మాదిరిగా మౌనం వహిస్తారా? అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ కమలం మరోసారి వికసించింది. దీంతో కేసీఆర్ టీమ్ డీలా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీఆర్ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తో కూడా ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ చర్చలు జరిపి వచ్చారు. త్వరలోనే బెంగళూరు వెళతానన్నారు. దేవెగౌడతో, మమతా బెనర్జీతో ఫోన్ లో చర్చలు జరిపారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను చూసిన రాజకీయ విశ్లేషకులు.. ఇంకేముంది జాతీయ రాజకీయాలపై ఆయన స్పీడ్ పెంచారనే భావించారు. ఇకపై ఢిల్లీలోనే తిష్ట వేసి కొత్త కూటమికి ప్రణాళికలు వేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ హడావుడి చూసి కొందరు అభిమానులు ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ‘దేశ్ కా నేత కేసీఆర్’ అంటూ పోస్టర్లు వేయడం గమనార్హం. టీఆర్ఎస్ శ్రేణులైతే మరో అడుగు ముందుకేసి కాబోయే ప్రధాని కేసీఆర్ అంటూ స్లోగన్స్ అందుకోవడం గమనార్హం.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మీడియాలో కూడా ఆయన అనారోగ్యం గురించి రకరకాల కథనాలు, వార్తలు అందరినీ ఆకర్షించాయి. అనారోగ్యం కారణంగా వారం పది రోజులు కేసీఆర్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు సూచించారు. అంటే ఈ వారం పది రోజులు ఆయన జాతీయ రాజకీయాల గురించి ఆలోచన చేయడం గానీ, చర్చలు జరపడం గాని ఉండకపోవచ్చంటున్నారు.నిజానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం అంటే అంత ఈజీ కాదని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తో కలిసి నడిచేందుకు ప్రాంతీయ పార్టీలు అంతగా సుముఖత చూపించకపోవచ్చే అంచనాలు వస్తున్నాయి. సెమీ ఫైనల్లో విజయ దుందుభి మోగించి మంచి జోరు మీదున్న బీజేపీ నుంచి, మోడీ- అమిత్ షా రాజకీయ మంత్రాంగం నుంచి తమను తాము కాపాడుకోవడంపైనే అవి దృష్టి పెడతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటవ్వాలన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేసీఆర్ ప్రతిపాదన ప్రస్తుత పరిస్థితుల్లో అటకెక్కిపోవచ్చంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ జాతీయ ఫ్రంట్ ప్రయత్నాలకు మరోసారి బ్రేకులు పడినట్లే అనే అంచనాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుండడం గమనార్హం.

Related Posts