ముంబై, మార్చి 14,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవోను స్టాక్ మార్కెట్‌లోకి తీసుకెళ్లాలని కేంద్రం భావించింది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు, సంస్థ ప్రయోజనాల కోసం వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఐపీవోకు అనుమతించాలని ఎల్ఐసీ దాఖలు చేసిన అప్లికేషన్‌ను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదించింది. ఈ అనుమతి మే 12 వరకు అమలులో ఉంటుంది. అప్పట్లోగా మార్కెట్ పరిస్థితులను బట్టి ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లొచ్చు. ఈ గడువు దాటితే మాత్రం మళ్లీ సెబీ ముందు ఎల్ఐసీ మరోమారు ఐపీవోకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.ఎల్ఐసీ ఎంబీడెడ్ విలువ రూ.5 లక్షల కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఒకవేళ మే 12 నాటికి ఎల్ఐసీ ఐపీవో.. స్టాక్ మార్కెట్లను తాకకుంటే మళ్లీ ముసాయిదా పత్రాలను సెబీ ముందు దాఖలు చేయాల్సి ఉంటుంది. అందులో డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫలితాలను చేర్చి ఆ ముసాయిదా సమర్పించాలిఎల్ఐసీలో ఐదు శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.63 వేల కోట్ల నిధులు వస్తాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ఎల్ఐసీ ఐపీవోలో షేర్లు విక్రయిస్తారు. రూ.10 ముఖ విలువ గల ఈక్విటీ షేర్లు 31.6 కోట్ల పై చిలుకు షేర్లను ఎల్ఐసీ విక్రయించాలని తలపెట్టింది.