తిరుపతి, మార్చి 15,
చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి పాము గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాము పేరు చెప్తే చాలు ఆ కుటుంబం వణికిపోతోంది. 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు.ఇటీవల శనివారం రాత్రి జగదీష్ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అతడి కాలుపై పాము కాటేసింది. వెంటనే అతడిని కుటుంబీకులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గతంలో వెంకటేష్ రెండు సార్లు, ఆయన తండ్రి, ఆయన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ ఒక్కోసారి పాముకాటుకు గురయ్యారు. తాజాగా జగదీష్‌ను రెండోసారి పాము కాటేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితులు నివసించే కొట్టం సమీపంలో మరో మూడు కుటుంబాలు నివసిస్తున్నా.. వారిని పాము ఏమీ చేయడం లేదని గ్రామస్తులు వెల్లడించారు. అయితే బాధిత కుటుంబసభ్యులు మరోచోటకు వెళ్లేందుకు అంగీకరించడం లేదని వారు వాపోతున్నారు.