రాజమండ్రి, మార్చి 15,
రాష్ట్రంలో చికెన్ ధరలు కొండెక్కాయి. కేజి చికెన్‌ను 280 రూపాయల నుండి 300 రూపాయల వరకు విక్రయించారు. పది రోజుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వంద రూపాయలకు పైగా ధర పెరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సీజనల్ కారణాలతో పాటు, ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్దం కూడా ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు. మరోవైపు లైవ్ కూడా 170 నుండి 190 రూపాయల వరకు అమ్ముతున్నారు. వీటి ధరలు కూడా ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. చికెన్ ధరతో పాటు ఇతర నిత్యావసరాల ధరలు పెరగడం, ముఖ్యంగా వంట నూనెల ధరలు చుక్కలను తాకడం, అదే సమయంలో కరోనా తదితర కారణాల వల్ల కొంతకాలంగా ఆదాయం గణనీయంగా తగ్గడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో చికెన్ ధరలు పెరగడం పరిపాటే. అయితే, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎండలు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఫౌల్ట్రీ రైతులు కొత్త బ్యాచ్‌లను వేయడం మానుకుంటున్నారు. దీంతో సహజంగానే కొరత పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. కోళ్లకు దాణాగా వేసే సోయాబీన్స్ కేజి ధర నెల రోజుల క్రితం 35 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 90 రూపాయలకు చేరింది. మొక్కజొన్న కూడా కేజీ రూ.12 నుంచి రూ.24కు చేరుకుంది. దేశీయంగా జరిగే బీన్స్, మొక్కజొన్న ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అదే సమయంలో మన అవసరాల కోసం సోయాబీన్స్‌ను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటు న్నారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా సోయాబీన్స్ ధర అమాంతంగా పెరిగిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీన్స్, మొక్కజొన్న పంటలు వేసినా ఇవి చేతికి వచ్చే సరికి మరో నెల రోజులు పడుతుందని, అప్పటి వరకూ దాణా ధరలు తగ్గే అవకాశం కూడా లేదని అంటున్నారు. ఈ లోగా వేసవి ప్రభావం తీవ్రం కానుండటంతో కోళ్ల ఉత్పత్తి తగ్గనుంది. దీంతో మరో రెండు, మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.తూర్పుగోదావరి జిల్లాలో 400 వరకూ కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఆయా ఫారాల్లో ఏడు లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతోంది. ప్రతి 40 రోజుల అనంతరం కోళ్లను మాంసం విక్రయానికి సిద్ధం చేస్తారు. జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతాయి. ఇటీవల తెలంగాణలో జాతరలకు సైతం ఇక్కడి నుంచే కోళ్లను భారీగా ఎగుమతి చేశారు. ఇతర రాష్ట్రాలకు సైతం జిల్లా నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. గతేడాది మార్చి ఒకటిన స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.160 ఉండేది. అదే నెల పదో తేదీకి రూ.230కి పెరిగింది. ఈ ఏడాది మార్చి ఒకటిన ధర రూ.180 నుంచి రూ.200 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.280కి ఎగబాకింది. గుడ్డు ధరను నెక్ సంస్థ నియంత్రిస్తుందని, మాంసం ధరను ఏ సంస్థ నియంత్రించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అనపర్తి, మండపేట, పెద్దాపురం వంటి ప్రాంతాల్లో బడా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు సైతం ఈ వ్యాపారంలో ఉన్నాయి. వీరే కృత్రిమ కొరతను సృష్టిస్తు ధరలు పెంచుతున్నార్న విమర్శలూ ఉన్నాయి.