హైదరాబాద్, మార్చి 15,
త్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసనభసభల్లో ఘన విజయాలు సాధించిన జోష్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఈ ఎన్నికలతో తనకు తిరుగేలేదని బీజేపీ నిరూపించుకుంది. ఉత్తరాదిలో బలీయంగా ఉన్న బీజేపీ దక్షిణ భారతదేశంలో కూడా తన ఉనికిని చాటుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో కూడా పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు వేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు సొంత వ్యూహకర్తల బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించాలని నిర్ణయించిందట. ఈ పోల్ స్ట్రాటజీ బృందం కూడా మార్చి నెలాఖరులో తెలంగాణలో కాలుపెట్టి, పని మొదలుపెడుతుందని ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.2023 ఆఖరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మొన్నటి యూపీ ఎన్నికల విజయంతో దూకుడుమీద ఉన్న బీజేపీ.. తెలంగాణ ఎన్నికలపైనా దృష్టి పెట్టనుందట. తెలంగాణలో బీజేపీని గెలుపు దిశగా అడుగులు వేయించేందుకు, అధికార పగ్గాలు చేపట్టేందుకు వ్యూహాలను అమలు చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించిందట. అందు కోసమే సొంతంగా ఎన్నికల నిపుణులను రంగంలోకి దింపాలని డిసైడ్ అయిందంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి విజయం చేకూర్చిపెట్టిన సొంత వ్యూహకర్తల బృందాన్నే తెలంగాణకు కూడా పంపిస్తోందట. కేంద్రంలోని బీజేపీ పైనా, ప్రధాని మోడీపైన ప్రత్యక్షంగా ఆరోపణలు, విమర్శలతో దాడి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కొమ్ములు వంచాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయిందంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం, అధికారానికి కావాల్సిన అసెంబ్లీ స్థానాలు చేజిక్కించుకోవడం, తద్వారా దక్షిణాదినా తన ఉనికిని ప్రదర్శించుకోవడం అనే లక్ష్యాలతో బీజేపీ ముందుకు సాగుతోందంటున్నారు.ఇప్పటికే సీఎం కేసీఆర్ పైనా, ఆయన నిర్ణయాలపైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటికాలిపై లేస్తున్నారు. మరో పక్కన సమయం చిక్కినప్పుడల్లా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తూర్పారపడుతూనే ఉన్నారు. తెలంగాణలో పాగా వేయడం ద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లోక్ సభాస్థానాలకు తోడు వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచి, తమ పట్టు నిలుపుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోందట.గత ఎన్నికల్లో హైదరాబాద్ లోని గోషామహల్ అసెంబ్లీ సీటు ఒక్కటే గెలిచిన బీజేపీ అనంతరం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకుని మరింత హుషారుగా ఉంది. ఆ తర్వాత ఇటీవలే జరిగిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలుపుతో మరో ముందడుగు వేసింది. ఇదే జోష్ ను రాబోయే ఎన్నికల్లో కూడా కొనసాగించాలని, కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు చెక్ పెట్టడంతో పాటు అధికారం చేజిక్కించుకోవాలనే కృతనిశ్చయంతో బీజేపీ అధిష్టానం ఉందని చెబుతున్నారు.ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ మినహా ప్రత్యామ్నాయం అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేయడం, బీజేపీని, ప్రధాని మోడీని ఇష్టం వచ్చినట్లు విమర్శించడం కూడా బీజేపీ అధిష్టానం అస్సలు సహించడం లేదంటున్నారు. ఒక పక్కన ప్రత్యామ్నాయం అంటూ వివిధ రాష్ట్రాల్లో టూర్లు చేసి, బీజేపీ యేతర నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. మరో పక్కన ఇటీవల ముచ్చింతల్ జరిగిన ‘సమతా మూర్తి’ రామానుచార్యుల విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు తనను ఆహ్వానించకుండా సాకు చెప్పి గైర్హాజర్ అయిన కేసీఆర్ ను మోడీని గుర్తుపెట్టుకున్నారంటున్నారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవుల్లోని వ్యక్తులు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతించకుండా కేసీఆర్ ముఖం చాటు వేయడాన్ని మోడీ, అమిత్ షా ద్వయం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఎలాగైనా కేసీఆర్ అహాన్ని అణచాలనే సమయం కోసం వారు ఎదురు చూస్తున్నారంటున్నారు.కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణల కారణంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరకలేదంటున్నారు. రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేసినా కేసీఆర్ కు ప్రధాని మోడీ దర్శనం దక్కలేదంటున్నారు.కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేస్తామంటూ తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నేరుగా హెచ్చరికలకు దిగడం బీజేపీ అధిష్టానం వ్యూహంలో భాగమే కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అసలే కేసీఆర్ అంటే తోక తొక్కిన నాగుపాములా లేచే బండి సంజయ్ ‘కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేసి చూడు.. ఏమవుతుందో చూపిస్తామం’టూ గట్టిగానే వర్నింగ్ ఇవ్వడం విశేషం. అంతకు ముందు పాతయాత్రల సందర్భంగా కూడా బండి సంజయ్ సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు.ఇప్పుడు ఏకంగా యూపీలో బీజేపీని విజయపథం వైపు నడిపించిన పోల్ స్ట్రాటజీ టీమ్ నే ఆ పార్టీ అధిష్టానం తెలంగాణలో దింపుతుండడాన్ని చూస్తుంటే.. కేసీఆర్ అధికారానికి, టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి 60 మందితో కూడి పోల్ స్ట్రాటజీ బృందం తెలంగాణలో అడుగుపెడుతోందట. ఆ బృందం ఆ వెంటనే పోల్ మేనేజ్ మెంట్ పని మొదలుపెడుతుందని బీజేపీ వర్గాల వారు చెబుతుండడం విశేషం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ట్ సేవల్ని కేసీఆర్ తీసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటికి రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారం అనుభిస్తోంది. ఈ క్రమంలో తమ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించాలని, మూడోసారి కూడా గెలిచి, హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంలో పీకే బృందాన్ని నియమించుకుంది. అయితే.. బీజేపీ తన సొంత పోల్ స్ట్రాటజీ బృందాన్ని తెలంగాణలో దించుతోంది. వచ్చే ఎన్నికల్లో పీకే వ్యూహాలు ఫలిస్తాయా..? లేక బీజేపీ స్ట్రాటజీ బృందం ప్రణాళికలు గెలుపు తెచ్చిపెడతాయా? టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా? లేదంటే బీజేపీయే చరిత్రాత్మక విజయం సాధించి, దక్షిణాది రాష్ట్రం తెలంగాణలో అధికారం చెలాయిస్తుందా? భవిష్యత్తే తేల్చనుంది.