విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికి ఇవ్వబోతున్నది? సమన్వయకర్తల్లో ఎవరో ఒకరికి ఆ అదృష్టం దక్కుతుందా? లేక కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారా? సాగరతీరంలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ విశాఖకు అప్పుడే ఎన్నికల ఫీవర్ పట్టుకుంది.. అన్ని పార్టీలలో ఒకటే చర్చ! ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు...? ఏ పార్టీ ఎవరిని రంగంలోకి దింపుతుంది...? అన్నవే చర్చలో ప్రధానాంశాలు! జిల్లాలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 2014లో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది తెలుగుదేశంపార్టీ! బీజేపీ నుంచి విష్ణుకుమార్‌రాజు పోటీ చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి చొక్కాకుల వెంకటరావు బరిలో దిగారు.. టీడీపీ అండతో విష్ణుకుమార్‌రాజు సునాయాసంగా విజయం సాధించారు. పరాజయం పాలైన చొక్కాకుల వెంకటరావుకు నియోజకవర్గంలో ఇప్పటికీ మంచి పేరే ఉంది. ఓడిపోయిన కారణంగా ప్రజలలో ఆయనపై కొంచెం సానుభూతి కూడా ఉంది. పార్టీలకు అతీతంగా చొక్కాకులను అందరూ గౌరవించడం గమనార్హం. ఆజాత శత్రువుగా పేరుగడించిన చొక్కాకుల ఓటమిభారంతో కొంతకాలం సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. పార్టీ మారినప్పటికీ జగన్మోహన్‌రెడ్డిని కానీ.. చంద్రబాబును కానీ పల్లెత్తు మాట అనలేదు.. విమర్శలకు చాలా దూరంగా ఉన్నారాయన! అయితే బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే తలంపుతో చొక్కాకుల ఉన్నారని ఆయన అభిమానులు అంటున్నారు.
మారిన రాజకీయ పరిస్థితులతో ప్రస్తుతం చొక్కాకుల వెంకటరావు చూపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నదని.. త్వరలో ఆయన ఆ పార్టీలో చేరతారని నియోజకవర్గంలో అనుకుంటున్నారు. పార్టీలో చేరడానికి చొక్కాకుల ఉత్సాహంగా ఉన్న విషయం జగన్మోహన్‌రెడ్డి చెవిలో పడిందట! ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట! ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ విశాఖకు వచ్చినప్పుడు చొక్కాకుల పార్టీ చొక్కా మార్చేయడం ఖాయమని.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీదనే ఆయన పోటీ చేస్తారని ఆయన ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చొక్కాకుల చేరడం కొంతమందికి ఇష్టం లేదు.. ప్రస్తుతం పార్టీ సమన్వయకర్తలలో కొందరు తీవ్రంగా రగిలిపోతున్నారట! విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు ఉన్నారు. సత్తి రామకృష్ణారెడ్డి.. సనపల చంద్రమౌళి.. పసుపులేటి ఉషాకిరణ్‌లు ప్రస్తుతం ఆ బాధ్యతలను మోస్తున్నారు.
పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని మళ్లీ పార్టీలోకి ఎలా తీసుకుంటారని వీరిలో ఒకరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారట! పార్టీలో తీసుకుంటే అభ్యంతరం లేదుకానీ.. టికెట్ మాత్రం ఇవ్వకూడదన్నది ఆయన వాదన! అసలు జిల్లాలో ఏ నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు లేరు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఉత్తర నియోజకవర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పుడున్న సమన్వయకర్తలు కాకుండా.. ఆర్ధికబలం అపారంగా ఉన్న వెంకటపతి రాజును రంగంలోకి దింపబోతున్నారన్న టాక్ మొన్నటి వరకు నడిచింది.. తమను కాదని ఇప్పుడు చొక్కాకుల వెంకటరావుకు టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని సమన్వయకర్తలు లోలోపల అనుకుంటున్నారట! ఇంతకాలం పార్టీని నడిపించిన తమకు మొండిచేయి చూపిస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారట కూడా! అయినా చొక్కాకుల ఇంకా పార్టీలో చేరలేదు కదా? వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నారట! మరి వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని రంగంలోకి దింపుతుంది..? సమన్వయకర్తలలో ఎవరో ఒకరికి టికెట్ దక్కుతుందా? లేక చొక్కాకులకు ఇస్తారా? అన్నది రానున్న కాలంలో తేలిపోతుంది. అంతవరకు ఈ సస్పెన్స్ తప్పదు.