హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు మంగళవారం నాడు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల మొదటి రోజు సభకు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తమ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కేసు విచారించిన హైకోర్టు.. ఎమ్మెల్యేలను సస్పండ్ చేసిన తీరు సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కోర్టు నోటీసులు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అసెంబ్లీ కార్యదర్శిని హెచ్చరించింది. సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలను మంగళవారం స్పీకర్ వద్దకు తీసుకెళ్లాలని ఆయన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన కాపీలతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసారు. అయితే, సస్పెన్షన్ పై స్పీకర్ దే తుది నిర్ణయమన్న హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించడం లేదు. కోర్టు సూచనలను తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని ఎమ్మెల్యేలు తెలిపారు. మరోవైపు మంగళవారంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి.