బెంగళూరు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఇస్లాం ఆచారం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి అని ఎక్కడా లేదని జిస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఇటీవల ఉడిపి కాలేజీలో ఆరుగురు అమ్మాయిలు హిజాబ్ ధరించడం వల్ల వివాదం ముదిరిన విషయం తెలిసిందే. హిజాబ్ ధారణ ఇస్లాం మతంలో తప్పనిసరి ఆచారమేమీ కాదు అని ఇవాళ కోర్టు చెప్పింది.
విద్యాసంస్థల్లో హిజాబ్పై విధించిన బ్యాన్ను కోర్టు సమర్థించింది. యూనిఫామ్ను ధరించడమనేది ఫ్రాథమిక హక్కులకు భంగం కాదు అని, కేవలం ఆంక్ష మాత్రమే అవుతుందని కోర్టు తెలిపింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ వివాదంపై మూడు ప్రశ్నలపై సమాధానాలు తెలుసుకున్నామని న్యాయమూర్తులు అన్నారు. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరా అనే ప్రశ్నకు.. హిజాబ్ ధరించడం మతపరమైన ఆచరణలో భాగమని.. తప్పనిసరి మాత్రం కాదని తెలుసుకున్నామన్నారు. రెండోది ... హిజాబ్ ధరించడం భావప్రకటన స్వేచ్ఛ, గోప్యత హక్కు కిందకు వస్తుందా అని అడగ్గా.. స్కూల్ యూనిఫాం అనేది రీజనబుల్ రిస్ట్రిక్షన్ అని.. దానికి స్టూడెంట్లు అభ్యంతరం చెప్పకూడదని వివరణ వచ్చిందన్నారు. మూడోది.. ఫిబ్రవరి 5నాటి జీవో ఏకపక్షంగా జారీ చేశారా అని ప్రశ్నించగా.. జీవో జారీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీని జారీ చేసిన ప్రభుత్వ జీవోను నిర్వీర్యం చేయడంలేదని కోర్టు చెప్పింది.