న్యూఢిల్లీ మార్చ్ 15
ఈనెల 9వ తేదీన ప్రమాదవశాత్తు మన దేశానికి చెందిన మిస్సైల్ ఒకటి పాకిస్థాన్‌లో పడినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ రాజ్యసభలో తెలిపారు. రొటీన్‌గా జరిగే తనిఖీ సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్‌లో పడిన మిస్సైల్‌కు సంబంధించి మంత్రి రాజ్‌నాథ్ ఇవాళ ప్రకటన చేశారు. ప్రమాదవశాత్తు మిస్సైల్ ఫైర్ అయ్యిందని, అయితే అది కాస్త పాకిస్థాన్‌లో పడినట్లు గుర్తించామన్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఈ ఘటన పట్ల అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. తమ ప్రభుత్వం వెపన్ సిస్టమ్‌కు సర్వోన్నత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మన మిస్సైల్ వ్యవస్థ అత్యంత సురక్షితమైందని, నమ్మదగినదని మంత్రి సభకు హామీ ఇచ్చారు.ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే.. తెలియకుండా మిస్సైల్ రిలీజైందన్నారు. 9వ తేదీన రాత్రి ఏడు గంటలకు రొటీన్ చెకింగ్ చేస్తున్న సమయంలో మిస్సైల్ రిలీజైనట్లు మంత్రి చెప్పారు. అయితే ఆ క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడినట్లు గుర్తించామన్నారు. ఇది చాలా ఖండించదగ్గ విషయమన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నదని, దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విచారణ తర్వాత మిస్సైల్ రిలీజ్‌కు చెందిన కారణం తెలుస్తుందన్నారు. మన సైనిక బలగాలు చాలా క్రమశిక్షణతో ఉన్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతాయన్నారు.