YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ధాన్యం దళారుల పాలు

ధాన్యం దళారుల పాలు

ధాన్యం.. అన్నదాతల రెక్కల కష్టం. ఆరుగాలం శ్రమించి పండించిన పంట. కానీ కష్టానికి ఫలితం దక్కడం లేదు. కంటికి రెప్పలా కాపాడుకొంటూ విపణికి తీసుకొస్తే.. సకాలంలో కాంటాలు కావడం లేదు.. రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. ఈలోగా వరుణుడి ఆక్రోశానికి నష్టపోవాల్సి వస్తోంది. వీటిని ఆసరాగా తీసుకొన్న దళారులు రంగంలోకి దిగారు. మాయమాటలు చెప్పి.. గ్రామాల్లోనే అక్రమంగా కాంటాలు వేస్తున్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో యార్డు లేకపోవడంతో నేలపైనే పోయాల్సి వస్తోంది. పైగా కాంటాలు కావడానికి కనీసం నాలుగు రోజులు పడిగాపులుకాయాల్సి వస్తోంది. పంటను విక్రయించడానికి ఇబ్బందులు ఎదురవుతుండడంతో గత్యంతరం లేక దళారులకే  అమ్మి నష్టపోతున్నారు.

 

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ధాన్యం దళారుల పాలవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కర్షకులు రకరకాల ఇబ్బందులు పడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం అన్నీ సవ్యంగానే ఉన్నాయని చెబుతూ చేతులు దులిపేసుకుంటుంది.ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. అప్పటికే వరి కోతలు పూర్తయ్యి, కల్లాల్లో వడ్లు ఆరబోశారు. వరుణుడు కన్నెర్రజేయడంతో ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. దీంతో మళ్లీ ఎండబెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. 16 శాతం తేమ ఉన్నా తీసుకోవాల్సి ఉండగా, 14 శాతం ఉన్నా తీసుకోమంటున్నారు. మరోవైపు మంత్రులు, అధికారులు తడిసిన ప్రతీ గింజను కొంటామంటూ ప్రకటనలు ఇస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

 

ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని అయిదు జిల్లాల్లో  522 ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటికి 426 మాత్రమే తెరచుకున్నాయి. దీంతో కాంటాలు కావడానికి కనీసం నాలుగురోజులు వేచిచూడాల్సి వస్తోంది. పోనీ కాస్త ఆలస్యమైనా కాంటాలు చేసుకునే పరిస్థితి లేదు. కాంటాలు అయ్యే వరకు ధాన్యానికి కాపలా రైతులే. టార్పాలిన్‌ కవర్లు లేక, కేంద్రాల్లో ఎలాంటి షెడ్డులు లేకపోవడంతో నాలుగు చినుకులు కురిసినా నష్టపోవాల్సిన దుస్థితి. ఇన్ని బాధలు పడలేని రైతాంగం సరైన గిట్టుబాటు ధర రాకున్నా గ్రామాల్లో ఉన్న మధ్యవర్తులకే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం క్వింటాకు రూ. 1590 చెల్లించాల్సి ఉంది. దళారులు రూ. 1520లోపు చెల్లించి లాభాలు మూట గట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఏకంగా దళారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై రైతుల నుంచి కొన్న పంటను అప్పటికప్పుడు అధికమొత్తానికి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు.

 

కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే ఒక్కో చోట ఒక్కో సమస్య కర్షకులను వేధిస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 217 కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికి కేవలం 160 కేంద్రాలు తెరుచుకున్నాయి. ఈ జిల్లాలో రవాణా కోసం లారీల కొరత వేధిస్తోంది. టార్పాలిన్‌ కవర్లు, గన్నీసంచులు సరిపడా లేకే అనేక కేంద్రాలను ప్రభుత్వ సంస్థలు ప్రారంభించలేకపోతున్నాయని సమాచారం. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం కూనూరు గ్రామంలోని ఐకేపీ కేంద్రం 20 రోజుల క్రితం ప్రారంభమైంది. లారీలు లేక కేంద్రంలో పదివేలకుపైగా బస్తాలు మిల్లులకు చేరని పరిస్థితి. ఇటీవల వర్షానికి ధాన్యం తడవడంతో రైతులే రవాణా ఖర్చులు భరించి ట్రాక్టర్లలో మడికొండకు పంపుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో నందన ఎఫ్‌.ఎ.సి.ఎస్‌ కొనుగోలు కేంద్రంలో రైతులకు సరైన వసతులు కల్పించలేకపోవడంతో పరిసర ప్రాంతాల రైతులు దళారులకే ఎక్కువగా విక్రియించారు. హమాలీల సమస్యతోపాటు, టార్పాలిన్‌ కవర్లు ఇవ్వకపోవడం, వరుస క్రమంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు.

Related Posts