హైదరాబాద్, మార్చి 15,
శాసనసభలో స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్తానాలు సరిదిద్దలేవని, ఆ బాధ్యత స్పీకర్‌దే అని హైకోర్టు పేర్కొందని సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఐతే, స్పీకర్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదని, ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని ఈటల అన్నారు. ఈ అంశంపై సభ అభిప్రాయం కోరమని అడిగినా స్పీకర్ పట్టించకోలేదన్నారాయన.స్పీకర్ వ్యవహార శైలి చూస్తుంటే ఉత్తర కొరియా గుర్తుకు వస్తోందని, చప్పట్లు కొట్టలేదని అక్కడ కాల్చి చంపారని, అలాగే అసెంబ్లీ లో చప్పట్లు కొట్టలేదని సస్పెండ్ చేసే రోజు కూడా వస్తుందేమో అన్నారు ఈటల. తమను సస్పెండ్ చేసిన మంత్రి గతంలో కేసీఆర్ ను ఎన్ని మాటలు అన్నాడో అందరికి తెలుసని, ఎవరికైనా ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని, శిక్ష అనుభవించేది కేసీఆర్ మాత్రమే అని ఈటల హెచ్చరించారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించండి, నియంతృత్వాన్ని బొంద పెట్టండి అనే నినాదంతో ఈ నెల 17 న ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.ఇది ఇలావుంటే, పోడియం దగ్గరకి వెళ్లిన తనను సస్పెండ్ చేసి తమ ఎమ్మెల్యే లను సభకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశానని సస్పెన్షన్‌కు గురైన మరో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తనకు స్పీకర్ ముఖంలో భయం కనిపించిందని ఆయన అన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో సరైన పాఠం చెపుతారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.