విజయవాడ, మార్చి 16,
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ వచ్చేసింది… గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగన జనసేన ఆవిర్భావ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వమంటూ స్పష్టం చేసిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాం.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాష్ట్ర అభివృద్ధికోసం పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆయన.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందనే తరహాలో చెప్పకనే క్లారిటీగా చెప్పేసినట్టు అయ్యింది.రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ టీడీపీ-జనసేన దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగినట్టు కొన్నిసందర్భాల్లో స్పష్టం అయ్యింది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో కలిసి పోటీ చేయడం.. అధికారాన్ని పంచుకోవడం కూడా చేశారు.. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయా? లేదా ? అనే విషయంలో చర్చ సాగుతూ వస్తోంది.. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత క్లారిటీ ఇచ్చాయనే చెప్పాలి.. అయితే, జనసేన పార్టీ నేతలు.. పవన్ కల్యాణ్ కీలకమైన ప్రకటన చేస్తారని.. రాష్ట్ర భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేసే ప్రకటన ఉంటుందని చెబుతూ వచ్చారు.. దాని అనుగుణంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నా.. కొంత గందరగోళ పరిస్థితి కూడా ఉందంటున్నారు విశ్లేషకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందనే చెబుతూనే.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నానని చెప్పడం ఏంటి? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.