విజయవాడ, మార్చి 16,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డైరెక్షన్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇటీవలి ఎన్నికల విజయంతో మంచి ఊపు మీద ఉంది. ప్రతికూల పరిస్థితులలోనూ ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారం నిలబెట్టుకోవటం గొప్ప విశేషం. ఈ గెలుపుతో 2024 ఎన్నికల్లో కూడా తమదే విజయం అనే నిర్ధారణకు వచ్చారు కమలనాథులు. దాంతో, జాతీయ స్థాయిలో మరింత బలోపేతం అయ్యేందుకు పక్కాగా వ్యూహాలు రూపొందిస్తోంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో తమ వ్యతిరేకుల రాజకీయ నిర్మూలనపై ఫోకస్ పెట్టబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి లక్ష్యంగా మారనున్నారు.తాజా విజయాలతో బీజేపీ దక్షిణాదిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను ముందు టార్గెట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే అధికార పార్టీని నిద్రకు దూరం చేసింది. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి రేసులో ముందు నిలిచే క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ ఉంది. ఇక, రాబోవు రోజులలో తెలంగాణ కోసం అమిత్‌షా ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఐతే, బీజేపీ బలం అంతగాలేని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా బీజేపీ సీరియస్ ఉంది. దానికి కారణం తెలుగుదేశం పార్టీ.ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఎన్నడూ లేనంతగా బలహీనపడింది. చంద్రబాబును రాజకీయంగా కోలుకోకుండా చేయాలంటే ఇంతకు మించిన మంచి సమయం రాదని బీజేపీ బావిస్తోంది. ఐతే, రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న తమ బలంతో అది సాధ్యం కాదని ఆ పార్టీ పెద్దలకు తెలియంది కాదు. కానీ, ఆ కార్యాన్ని పవన్ కల్యాణ్‌తో సాధించాలన్నది దాని ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే జనసేకు కూడా పెద్ద ఓటు బ్యాంకు ఏమీ లేదు. కానీ, రాష్ట్రంలోని వై ఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత జనసేనకు అనుకూలంగా మారిస్తే చాలు గాలి పవన్ వైపు వీస్తుంది. దానికి ముందు పవన్ కళ్యాన్ పొలిటికల్ ఇమేజ్ ని స్థిరీకరించే బాధ్యతను కూడా బీజేపీ తనపై వేసుకున్నట్టు సమాచారం. కానీ అది బీజేపీ అనుకున్నంత సులభమా?అసమాన్య అభిమాన గణం పవన్ కల్యాణ్ సొంతం. కానీ రాజకీయ విజయాలకు అదొక్కటే సరిపోతుందా? ఓ స్థిరమైన రాజకీయ ఆలోచనా విధానం అవసరం లేదా? నిజానికి పవన్ లాంటి జనాకర్షణ కలిగిన వ్యక్తులు తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ. ఆయన సభ పెడితే జనం ఏమీ ఆశించకుండా స్వచ్చందంగా వెళతారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా జనంలో ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మరి ఎందుకు ఆయన జనం మదిలో బలమైన ముద్రవేయలేకపోతున్నారు? దానికి కారణం ఆయనే.పవన్ జనసేనను స్థాపించి ఎనిమిదేళ్లు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మరి ఈ పదమూడేళ్ల రాజకీయ ప్రస్తానంలో ఆయన ఏమి సాధించారు? పైగా రాజకీయంగా ఎదగటానికి ఆయనకు కావాల్సన అంశాలన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. కులం, ఆర్థిక బలం, అభిమాన గణం..ఓ రాజకీయ నేత విజయవంతం కావటానికి ఇంతకన్నా ఏం కావాలి? కానీ ఆయనకు ఆయనపైనే ఒక స్పష్టత లేదు. ఆయన పార్టీకి ఒక సైద్ధాంతిక స్పష్టత లేదు. ఇన్నేళ్లలో జనసేన పార్టీ పట్ల ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. పవర్ స్టార్ వైఫల్యాలకు ఇంతకన్నా కారణాలు ఏం కావాలి.పవన్ కల్యాణ్, అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. పవన్‌తో పోలిస్తే కేజ్రీవాల్ అనామకుడు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు. ప్రజలకు ఆమ్ ఆద్మీపార్టీ అవసరం ఏమిటో విస్పష్టంగా చెపుతారు. చెప్పిందే చేస్తారు. రెండవ ఆలోచనకు తావే లేదు. ఆప్ మాత్రమే కాదు ప్రతి రాజకీయ పార్టీకి తమకంటూ ఒక సైద్దాంతిక పునాది ఉంటుంది. జనసేనలో ఎవరికైనా అది కనిపిస్తుందా?వామపక్ష విప్లవయోధుడు చేగువేరా అంటే పవన్‌కు చెప్పలేని అభిమానం. ఆయన చెప్పే మాటలు వామపక్ష భావాలకు కొంత దగ్గరగా ఉంటాయి. అదే సమయంలో బీజేపీతో కలిసి నడుస్తారాయన. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. తరువాత ప్రత్యేక హోదా విషయంలో దానిని వదిలి లెఫ్ట్‌తో కలిశారు. వారితో అయినా ఎక్కువ కాలం ఉన్నారా అంటే అదీ లేదు. మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. దీనిని బట్టి ఆయనకు ఓ నిర్ధిష్టమైన రూట్ మ్యాప్ లేదని ఎవరికైనా అర్థమవుతుంది. బీజేపీ ఇప్పుడు ఆయనకు స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్దం చేసినట్టు కనబడుతోంది. అయితే అది అంత సులభమా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓటమి పాలయ్యారు. మీడియాలో కనిపించే ప్రభుత్వ వ్యతిరేకత తప్ప నిజంగా ప్రజలలో జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత ఉన్నదో లేదో తెలియదు. ఈ పరిస్థితిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ను జగన్ వర్సెస్ పవన్‌గా మార్చటం సాధ్యమేనా? అంటే సాధ్యమయ్యేలా బీజేపీ బ్యాక్‌గ్రౌండ్ రెడీ చేస్తోంది. పవన్‌ను రాజ్యసభకు పంపి మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. దాంతో ప్రజాకర్షణకు పదవి తోడై ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఐతే, ఇది పవన్‌కు అనేక చిక్కులు తెచ్చిపెట్టవచ్చు అది వేరే సంగతి.పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు గతంలో కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చిందని బీజేపీ బావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్‌ను మంత్రిని చేయటం ద్వారా అతడు చంద్రబాబు వైపు చూడకుండా చూడవచ్చన్నది బీజేపీ ప్లాన్. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మూడం స్థానంలోకి నెట్టేసేందుకు పవన్ ద్వారా బీజేపీ పథక రచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా పూర్తిగా తెరమరుగు చేయాలన్నదే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం.ఆంధ్రప్రదేశ్ లో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్‌షా తమకు రెండు నెలల క్రితమే రూట్ మ్యాప్ ఇచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. ఐతే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏం చేస్తారు అంటే మాత్రం ఆయన నుంచి స్పష్టమైన సమాధానం లేదు. టీడీపీతో తిరిగి కలిసే ఛాన్సే లేదని ఆయన చెప్పకపోయినా అర్థమవుతోంది.మరోవైపు, బీజేపీతో పాటు టీడీపీకి కూడా పవన్ కల్యాణ్ మినహా మరో దిక్కు లేదు. అన్ని రకాలుగా బలమైన వైసీపీతో తలపడటం టీడీపీ ఒక్కదానితో అయ్యే పని కాదు. పైగా ఆ పార్టీకి ఇప్పటి వరకు ఒంటరిగా గెలిచిన చరిత్ర లేదు. కనుక, పవన్‌తో చేతులు కలపటం మినహా దానికి మరో మార్గం లేదు. ఐతే, బాబు కోసం మోడీతో పవన్ సంబంధాలు తెంచుకుంటాడని ఎవరూ అనుకోరు. ఐతే, ఆయన బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడేందుకు ప్రయత్నించవచ్చు. జనసేన ఆవిర్బావ సభలో పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని మరీ మరీ చెప్పటం గమనార్హం. టీడీపీని కూడా కలుపుకుపోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. టీడీపీ కూడా బీజేపీతో కలిసేందుకు పవన్ సాయం కోరవచ్చు. కానీ, ఏ ప్రాతిపదికపై బాబు తిరిగి మోడీకి దగ్గరవుతారు. నిజంగా అలా జరిగితే వైసీపీకి అది తిరుగులేని అస్త్రం కాదా!