హైదరాబాద్, మార్చి 16,
పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే.. ఏపీలో కొత్త పొలిటికల్ పిక్చర్ ఆవిష్కృతం అవుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదు. ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం.. అంటూ జనసేనాని బహిరంగ సభా వేదికపైనే ప్రకటించేశారు. ఇప్పటికే బీజేపీతో జనసేన మైత్రి కొనసాగుతుండగా.. కాషాయం పార్టీ గురించి కొత్తగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆ జనసేన పొత్తు.. టీడీపీతోనే అని తేలిపోతోంది. అదే జనసేన వేదికపై పవన్ చేసిన మరో కామెంట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. "వైసీపీపై పోరాటానికి బీజేపీ రోడ్‌మ్యాప్ ఇస్తానంది.. ఇంకా ఇవ్వలేదు.. ఆ రోడ్‌మ్యాప్ ఎప్పుడు ఇస్తోందోనని మీలానే నేను కూడా ఎదురు చూస్తున్నా. బీజేపీ రోడ్‌మ్యాప్ ఇస్తే.. ఇక వైసీపీపై అసలైన యుద్ధం మొదలుపెడతాం" అని జనసేనాని అన్నారు. అయితే, బీజేపీ-రోడ్‌మ్యాప్ గురించి పవన్ మాట్లాడిన తీరు పాజిటివ్ కంటే నెగటివ్ మీనింగే ఎక్కువ వస్తోందని అంటున్నారు. బీజేపీ ప్రస్తావన వచ్చినప్పుడు పీకే వాయిస్‌లో అసహనం, అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. రోడ్‌మ్యాప్ ఇస్తానంది-ఇవ్వలేదు.. రోడ్‌మ్యాప్ గురించి చాలాకాలంగా ఎదురుచూస్తున్నా.. అంటూ జనసేన-బీజేపీల మధ్య గ్యాప్‌ను పరోక్షంగా స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అంటే, వైసీపీ-జగన్ లపై జనసేన పోరాడటం బీజేపీకి ఇష్టం లేనట్టేగా? పవన్ కు కమలనాథులు రోడ్ మ్యాప్ ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్టేగా?అవును, ఇటీవల బీజేపీలో మరింత మార్పు కనిపిస్తోంది. జనసేనకు బాగా దూరం జరిగింది. పవన్‌ను దూరం పెట్టేసింది. అదే సమయంలో వైసీపీతో, జగన్‌రెడ్డితో బాగా అంటకాగుతోంది కమలదళం. ప్రధాని మోదీ.. సీఎం జగన్‌ను సొంతబిడ్డలా చూసుకుంటున్నారంటూ అసలు నిజం ఆ పార్టీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఒప్పేసుకున్నారు. జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఇంత నత్తనడకగా ఎందుకు సాగుతున్నాయో అందరికీ తెలుసు. ఇక, జీవీఎల్, సోము, విష్ణు..లాంటి ఏపీ బీజేపీ నేతలు అధికార పార్టీని ఎంతగా వెనకేసుకొస్తుంటారో.. అదే సమయంలో టీడీపీ-చంద్రబాబుపై ఎంతగా దాడి చేస్తారో.. వేరే చెప్పాలా!. అంతెందుకు ఇటీవల భీమ్లా నాయక్ సినిమా టికెట్ల రేట్లపై అంతలా వివాదం చెలరేగితే.. బీజేపీ నుంచి ఒక్క డిమాండ్ కానీ, జగన్‌రెడ్డిపై ఒక్క విమర్శ కానీ రాలేదు. పైగా, వచ్చే ఎన్నికల్లో వైసీపీ-బీజేపీ పొత్తు ఉంటుందంటూ.. ఆఫ్ ది రికార్డ్ లీకులు ఇస్తున్నారు కూడా. అలా, పొగబెట్టి.. పవన్‌ను రెచ్చగొట్టి.. బీజేపీని వీడిపోయేలా కమలనాథులు పావులు కదుపుతున్నారని అంటున్నారు. జనసేనాని సైతం మామూలు నాయకుడేం కాదు. పక్కా రాజకీయ నేతగా రాటుదేలారు. రాజకీయాలను బాగా ఒంట బట్టించుకున్నారు. అందుకే, బీజేపీకి ఝలక్ ఇచ్చేందుకే, అదే సమయంలో జనసేనకు బీజేపీకంటే టీడీపీ రూపంలో బెస్ట్ ఆప్షన్ ఉందనే మెసేజ్ ఇచ్చేందుకే.. ఆ అంశంపై చర్చ జరిగేందుకే.. కావాలనే రెండేళ్లు ముందుగానే పొత్తులపై లీకులు ఇచ్చారు పవన్ కల్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో పాగా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కమలనాథులు.. తెలంగాణలో మాదిరి ఏపీలో పెద్దగా పురోగతి లేకపోవడంతో.. జనసేనకంటే వైసీపీతో పొత్తే తమకు బాగా కలిసొస్తుందనే లెక్కల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక, పవన్ లేటెస్ట్ క్లారిటీ ప్రకారం.. టీడీపీ, జనసేనల పొత్తు దాదాపు కన్ఫామ్. అంటే, 2024 ఎన్నికల యవనికపై.. "వైసీపీ+బీజేపీ" Vs "టీడీపీ+జనసేన".. ఇది క్లియర్!