YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చెరువు నీరు వృథా

చెరువు నీరు వృథా

నీటి బొట్టుబొట్టు ఒడిసి పట్టి గొంతులు తడుపుకొంటున్న ఈ తరుణంలో నిండుకుండలా తొణికిసలాడిన కజ్జర్ల చెరువు నీటిని వృథాగా బయటకు పంపుతున్నారు. చేపల వేట కోసం చెరువు తూము తీయడంతో దిగువనే ఉన్న వాగుల గుండా నీరు ప్రవహిస్తోంది. ఓ గుత్తేదారు మెప్పు కోసం ఊరందరికీ ఉపయోగపడే చెరువు నీటిని వృథా చేస్తున్నా ఊరంతా మౌనంగానే ఉండిపోయారు. ఇదంతా అధికారులకు తెలిసినా చర్యలకు మొహమాట పడుతున్నారు.

 

ఆదిలాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న కజ్జర్ల చెరువును 20ఏళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం రూ.3కోట్లతో నిర్మించింది. ఈ చెరువు ద్వారా దాదాపు 1400 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యం. అయితే.. ఆ చెరువుకు కాలువలు తవ్వకపోవడంతో అప్పటి నుంచి చెరువులో నీరు నిల్వ ఉంటుందే తప్ప వ్యవసాయానికి పనికిరావడం లేదు. చెరువులో నీళ్లుండటం వల్ల భూగర్భజల మట్టం పెరిగింది. బోర్లు, బావుల ద్వారా పంటలు సాగు చేసుకుంటున్నారు. కాలువ తవ్వకాలకు రూ.1.43 కోట్లు ఖర్చు చేశారు.

 

కజ్జర్ల చెరువులో గంగపుత్ర సంఘం పేరుతో అధికార పార్టీకి చెందిన నేత ఒకరు అయిదారేళ్లుగా చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. కజ్జర్ల, కోడద్‌ గ్రామాలకు చెందిన సంఘాలకు రూ.10లక్షల చొప్పున ఇచ్చేశారు. గ్రామాభివృద్థి కమిటీలకు కూడా గుత్తేదారు డబ్బులిచ్చి.. చేపలను పెంచడం, వాటిని వేటాడటం చేస్తున్నారు. ఏడాది పొడవున వలల ద్వారా చేపల వేట కొనసాగుతోంది. చెరువులో నీళ్లు ఉండటం వల్ల పూర్తిగా చేపలన్నింటిని పట్టుకోవడం కుదరడం లేదు. దీంతో చెపల వేటకు చెరువులో ఉన్న నీళ్లే అడ్డంకిగా భావించిన గుత్తేదారు నెల రోజుల నుంచి తూములు తెరచి నీటిని బయటకు పంపడం మొదలు పెట్టారు. రాత్రి వేళల్లో తూము తీసి నీటిని విడుదల చేయడం.. తెల్లారే సరికి మళ్లీ తూము తలుపులు వేసి నీటి విడుదల నిలిపివేస్తున్నారు. దీంతో క్రమ క్రమంగా చెరువులోని నీటి మట్టం తగ్గిపోయింది. ఇలాగే కొనసాగితే మరో వారం పదిరోజుల్లో చెరువులో నీరంత బయటకు పోయే పరిస్థితులున్నాయి. వేసవిలో కూడా నిండుకుండలా తొణికిసలాడిన కజ్జర్ల చెరువు ఇప్పుడు పూర్తిగా నీళ్లులేకుండా ఎండిపోయే ప్రమాదం నెలకుంది.

 

కజ్జర్ల చెరువు నుంచి విడుదల చేసిన నీరంతా దిగువకు వృథాగాపోతోంది. రూ.1.43కోట్లతో కాలువ తవ్వకాల పనులు పూర్తిచేశారు. తూము నుంచి క్రమ క్రమంగా దిగువకు నీళ్లు వెళ్లేలా కాలువను ఏటవాలుగా తవ్వాల్సి ఉన్నా.. ఆ నిబంధనలేవీ పట్టించుకోలేదు. దిగువకు వెళ్లే కొద్ది ఎత్తు పెరగడంతో నీటి ప్రవాహం కొనసాగడంలేదు. దీంతో మధ్యలో ఏర్పాటు చేసిన యూటీ వద్దనే నీరంతా వృథాగా పోతోంది. ఈ ప్రవాహం వల్ల దాదాపు వంద ఎకరాలు నీటి మయంగా మారాయి. అక్కడి రైతులు సాగు చేసుకున్న మొక్కజొన్న పంట కూడా నీరు ఎక్కువై పండకుండానే పోయింది. ఈ పొలాలను తడుపుకుంటూ దిగువనే ఉన్న వాగుల్లోకి నీరంతా ప్రవహిస్తుంది. ప్రస్తుతం నీటి ప్రవాహంతో వాగులు వర్షాకాలంలో మాదిరిగా తలపిస్తున్నాయి. వేసవిలో తాగు నీటి కోసం అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుండగా.. చెరువులో ఉన్న నీరంతా అక్రమంగా బయటకు పంపేస్తున్నారు.

 

చెరువు నీరంతా బయటకు పంపుతున్న విషయాన్ని కొందరు రైతులు జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్న నీటిపారుదలశాఖ అధికారులు చెరువును పరిశీలించారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. కనీసం గ్రామంలో విచారణ కూడా జరపలేదు. సంబంధిత గుత్తేదారుని మందలించనూలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరువు నీటిని వృథాగా బయటకు పంపిన వాళ్లపైన క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉంది. ఈ విషయంలో నీటిపారుదల శాఖతో పాటు రెవెన్యూశాఖ అధికారులు కూడా ప్రేక్షకపాత్రనే పోషిస్తున్నారు.

Related Posts