వరంగల్ మార్చి 16,
మిర్చి రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. నిత్యం నష్టాలపాలయ్యే మిర్చి రైతులకు రికార్డు స్థాయిలో పలుకుతున్న మిర్చి ధరలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వరంగల్ జిల్లా ఎనుబాముల మార్కెట్ చరిత్రలోనే ఎర్రబంగారానికి ఆల్‌టైం రికార్డు ధర పలికింది. మద్దతు ధర కోసం పోరాడే రైతుకు ఎర్రబంగారం సిరులు కురిపిస్తోంది. క్వింటాల్ మిర్చి ధర ఏకంగా 42వేల రూపాయలు పలికింది. ములుగు మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణరావు తాను పండించిన సింగిల్ పట్టి మిర్చిని ఎనుబాముల మార్కెట్‌కు తీసుకువచ్చారు. నాణ్యతతో ఉన్న మిర్చిని కొనుగోలు చేయడానికి ఖరీదుదారులు పోటీపడ్డారు. క్వింటాల్ మిర్చికి 42వేల రూపాయలుగా నిర్ణయించారు. మిర్చికి ధర భారీగా పలకడంతో రైతు ఆనందానికి అవధులు లేవు. ఏళ్లుగా మిర్చిని పండిస్తూనే ఉన్నప్పటికీ.. ఈ స్థాయి ధరను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నాడు. నిత్యం ఇదే స్థాయిలో ధరలు ఉంటే మిర్చి రైతులకు కన్నీరే ఉండదని స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎనుబాముల మార్కెట్ చరిత్రలో మిర్చి పంటకు ఇదే ఆల్‌టైం రికార్డు ధర అని అంటున్నారు మార్కెట్ అధికారులు. నెల రోజుల క్రితం వరకు అకాల వర్షాలతో నట్టేట మునిగాడు మిర్చి రైతు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో మిర్చి రైతుల కష్టాలు అన్నీఇన్ని కావు. అందులో వైరస్ అటాక్‌తో ఇంకొంత పంట నాశనం అయ్యింది. నిత్యం ఒడిదొడుకుల నడుమ నలిగే మిర్చి రైతు ఎనుబాముల మార్కెట్లో పలికిన ధరను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.