హైదరాబాద్, మార్చి 16,
రాష్ట్రoలో ఎంసెట్‌లో ఈసారి కూడా ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్‌ని రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. కరోనా పరిస్థితులతో ఈ విద్యాసంవత్సరం కూడా పూర్తి స్థాయిలో క్లాసులు జరగకపోవడం, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అందరినీ కనీస మార్కులతో పాస్ చేయడం వంటి కారణాలతో ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే ఇంటర్ మార్కులకు వెయిటేజీ వద్దని భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే స్పష్టత ఇవ్వాలని ఎంసెట్ కమిటీ స్పష్టత ఇవ్వనుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో జూన్‌లో ఎంసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి, ఎంసెట్ కమిటీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయడంతో గడచిన రెండేళ్లుగా ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తున్నారు.ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలను చేపడుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించినప్పటికీ, అధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతోపాటు విద్యార్థులంరికీ కనీస మార్కులు కేటాయించి పాస్ చేశారు. ఆ విద్యార్థులే ప్రస్తుతం ఎంసెట్‌కు హాజరుకానున్నారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలంటే ప్రథమ, ద్వితీయ సంవత్సరం మార్కులు ఉండాలి. అయితే ప్రథమ సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులకు కనీస మార్కులే ఉంటాయి కాబట్టి ఈసారి వెయిటేజి వద్దని ఎంసెట్ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.అయితే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈసారి పరీక్షలు జరుగుతున్నందున ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీని యథావిధిగా అమలు చేయాలనే అంశంపై ఎంసెట్ కమిటీ సమావేశంలో చర్చించారు. అయితే వెయిటేజీ విధానం అమలు చేస్తే… ఫస్టియర్ పరీక్షల్లో కనీస మార్కులతో పాస్ చేసినవారికి ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే కరోనా కారణంగా సెకండియర్ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు సరిగా జరగలేదు. ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షల్లో విద్యార్థులు పూర్తి స్థాయిలో మార్కులు సాధిస్తారా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని వెయిటేజీని అమలు చేయకూడదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.