YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

11, 103 ఉద్యోగుల క్రమబద్దీకరణ ..?

11, 103 ఉద్యోగుల క్రమబద్దీకరణ ..?

హైదరాబాద్, మార్చి 16,
ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కలు తేల్చే కసరత్తు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల పదో తేదీన అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితిపై నిర్దేశిత పద్ధతిలో నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించి ఉన్నతాధికారులకు పంపింది.  కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మొత్తం 14 రకాల వివరాలు సమర్పించాల్సి ఉంది. దీంతో పాటు విభాగాధిపతులు సమర్పించేందుకు 9 రకాల అంశాలతో మరో ఫార్మాట్‌ను తయారు చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన నమూనాలో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, అపాయింట్‌మెంట్‌ తేదీ, అపాయింట్‌మెంట్‌ తీరు (పార్ట్‌ టైమ్‌/ఫుల్‌ టైమ్‌), ప్రస్తుత నెలవారీ వేతనం, క్రమబద్ధీకరిస్తే ఇవ్వాల్సిన హోదా, శాఖలో ఖాళీల వివరాలు, ఉద్యోగ కేడర్, క్రమబద్ధీకరించే హోదాకు కావాల్సిన విద్యార్హతలు, ఉద్యోగి నియామకం నాటి అర్హతలు, ప్రస్తుత అర్హతలు,  ఉద్యోగి సామాజిక వర్గం, స్థానికత, క్రమబద్ధీకరించే పోస్టు రోస్టర్‌ పాయింట్స్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఉద్యోగి పనితీరు, రిమార్క్స్‌ సమర్పించాలి. వీటన్నిటినీ హెచ్‌ఓడీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగుల నుంచి వివరాలు స్వీకరించిన తర్వాత సదరు విభాగాధిపతి నిర్ణీత ఫార్మాట్‌లో 9 రకాల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, నియామకం అయ్యే నాటికి విద్యార్హతలు, మొదటి అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన శాఖ, నియమించిన పోస్టు, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి ఉన్న సర్వీసు, రిమార్క్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగి వ్యక్తిగతంగా ఇచ్చే వివరాల ఆధారంగా హెచ్‌ఓడీ ఆర్థిక శాఖకు వివరాలు సమర్పిస్తారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు పెద్దగా జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాలే ఎక్కువ. వీటిలో అత్యధికంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారే ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ప్రకారం 11,103 మంది ఉన్నట్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారెందరనే కోణంలో వివరాలను ఆర్థిక శాఖ రాబడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఉద్యోగ నియామకాల్లో పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు రాజీనామా చేసి కొత్తగా కొలువులు పొందారు. అంతేకాకుండా వివిధ కారణాలతో ఉద్యోగాలు మానేసినవారున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించడం, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాలను వదిలేసిన వారు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలతో, ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సరిపోతుందా లేదా అనే అంశం తేలాల్సి ఉంది. దీంతో హెచ్‌ఓడీల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఈ లెక్కలు తేల్చేందుకు ఆర్థికశాఖ సిద్ధమైంది.  

Related Posts