YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వచ్చే నెల 11 నాటికి డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పూర్తి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

వచ్చే నెల 11 నాటికి డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పూర్తి               రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  దేవినేని ఉమామహేశ్వర రావు

వచ్చే నెల 11 తేదీ నాటికి డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తవుతాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. పోలవరం, ఇతర ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో ముఖ్య ఘట్టం పూర్తి కానుందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు మొత్తం 53.50 శాతం పూర్తికాగా, ఇప్పుడు కీలకమైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పనులు తుది దశకు చేరాయన్నారు. వచ్చే నెల 11 తేదీ నాటికి ఈ రెండింటి నిర్మాణ పనులు పూర్తి కానున్నాయన్నారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి 60వ వర్చువల్ రివ్యూ చేశారన్నారు. డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు తుది అంకానికి రావడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఆ పనులు పూర్తి చేయగానే కెల్లర్, బావర్-ఎల్ అండ్ టీ సంస్థలు రిలీవ్‌ అవుతాయన్నారు. వచ్చే నెల 11 తేదీన తాను పోలవరం సందర్శించనున్నట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన పోలవరం కుడి ప్రధాన కాలువ 89.60 శాతం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.60 శాతం, స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్ ఎర్త్‌వర్క్ 73.26 శాతం, స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 21.83 శాతం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 91 శాతం, జెట్ గ్రౌటింగ్ పనులు 70 శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60.28 శాతం పనులు ఇప్పటి వరకూ పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారన్నారు.  ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ఖర్చు చేసిన మొత్తం వ్యయం రూ.13,430 కోట్లు అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. జాతీయ ప్రాజెక్టు కాకముందు చేసిన ఖర్చు రూ.5,135 కోట్లు అని, ప్రకటించిన తరువాత చేసిన రూ.8,294 కోట్లు వ్యయం చేశామని అన్నారు. ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి విడుదలైన నిధులు రూ.5,342 కోట్లు మాత్రమేనన్నారు. కేంద్రం నుంచి ఇంకా రూ.2,952 కోట్లు రావాల్సి ఉందన్నారు. గ్యాలరీ వాక్ నిర్మాణం కూడా ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. వారం రోజులుగా స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 5.59 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 29 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, అలాగే డయాఫ్రమ్ వాల్ 29 మీటర్ల వరకూ నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారన్నారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 817.32 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయన్నారు. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా, ఇప్పటి వరకూ 8.03 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నారు. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,271.60 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యిందని మంత్రి దేవినినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,850 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయన్నారు. ఏ నెల లక్ష్యం ఆ నెలలోనే పూర్తి కావాలని, కాంక్రీట్ పనుల్లో వేగం మందగించడంపై ముఖ్యమంత్రి ప్రశ్నించగా, మిషనరీలో తలెత్తిన సమస్యలతో కాస్త వెనుకబడినట్టు నిర్మాణ సంస్థల ప్రతినిధులు వెల్లడించారని మంత్రి తెలిపారు. నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు పూర్తిచేయాలని  అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. పోలవరం కుడి కాలువ పనులను త్వరగా పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు ముందుగా నీటిని విడుదల చేయొచ్చు అని సూచించారన్నారు. ప్రాధాన్య ప్రాజెక్టులకు డెడ్‌లైన్, పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 54 ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. అడవిపల్లి రిజర్వాయర్ మే 31 నాటికి, కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆగస్టు నాటికి, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ వచ్చే నెలాఖరుకు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మూలపల్లితో పాటు మరో 4 చెరువుల పనులు ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసి నీరు తీసుకెళ్లాలని, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు జూన్‌లో మొదలు పెట్టి డిసెంబర్‌కు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారన్నారు. మల్లెమడుగు, బాలాజీ, వేణుగోపాల్ సాగర్ రిజర్వాయర్లు, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌కు సంబంధించి అటవీ అనుమతులు త్వరితగతిన పొందడమే కాకుండా, ఇతర భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. వీటి ద్వారా జనవరి నుంచి సాగునీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని, పంచనదుల సంగమానికి సంకల్పిద్దామని, వంశధార-నాగావళి అనుసంధానం పనులను పరుగులు పెట్టించాలని, హిరమండలం డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారని మంత్రి వెల్లడించారు. ప్రాధాన్య ప్రాజెక్టుల పనులకు సంబంధించి టెండర్లు పిలించేందుకు కార్యాచరణ పట్టిక రూపొందించాలని సీఎం ఆదేశించారన్నారు. వంశధార-పెన్నా వరకు ఉన్న పంచ నదుల మహాసంగమానికి సంకల్పిద్దామని సీఎం అన్నారన్నారు. ప్రాధాన్య ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు పూర్తయిన పనులకు డబ్బులు చెల్లించాల్సి వుంటే నిర్మాణ సంస్థలకు తర్వగా చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారని మంత్రి దేవేనేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 

‘జల సంరక్షణ ఉద్యమ స్ఫూర్తి’ కింద చేపట్టిన పనులు నూరు శాతం పూర్తయ్యేందుకు వీలుగా గడువును 116 రోజుల నుంచి 139 రోజులకు పెంచుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి దేవినినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. జూన్ నెలాఖరు కల్లా పెండింగ్ పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. రూ.1300 కోట్ల నీరు -చెట్టు బకాయిలు రైతులకు  చెల్లించినట్లు మంత్రి తెలిపారు. గండికోట రిజర్వాయలో నీరు నిలబెట్టడానికి అవసరమైన రూ.230 కోట్లు సిద్ధం చేశామన్నారు.  

Related Posts