హైదరాబాద్ మార్చ్ 16
కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో 50 పడకల సీహెచ్‌సీ ఆస్పత్రి ప్రారంభంతో పాటు 12-14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా అయిపోయిందని, ఇక లేదని అనుకోవడం పొరపాటు. కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చూపలేదని, టీకా అవసరం లేదనే నిర్లక్ష్య ధోరణి పెట్టుకోవద్దు. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త కేసులు వస్తున్నాయని వింటున్నాం. డబ్ల్యూహెచ్‌వో కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు.60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని గతంలో కేంద్రానికి లేఖ రాశాం. ఇందుకు కేంద్రం అంగీకరించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇస్తామన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. మరణాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశీలనలో తేలిందన్నారు. కరోనా తీవ్రత లేదని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో విరామం లేకుండా పని చేస్తున్న ఆశా వర్కర్లకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో సేవలు అందించిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.