గుంటూరు, మార్చి 17,
పవన్ కల్యాణ్‌కు నమ్మకాలు ఎక్కువే. ఆయన దేవుళ్లను పూజిస్తారు. పండగలు జరుపుకుంటారు. ఆచారాలు పాటిస్తారు. సంప్రదాయాలను గౌరవిస్తారు. అన్ని మతాలను సమానంగా చూస్తూనే.. హిందుత్వాన్ని తు.చ. తప్పకుండా ఫాలో అవుతుంటారు. అదే కోవలో.. ఇటీవల జాతకాలు, ఉంగరాల మీద కూడా జనసేనానికి గురి కుదిరిందని అంటున్నారు. ఆ ఫలితమే.. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ కుడిచేతి ఉంగరపు వేలికి.. పే..ద్ద పగడపు ఉంగరం ధరించారని చెబుతున్నారు. అవును, గతంలో ఎప్పుడూ పవన్ ఇలా ఉంగరాలు, గొలుసులు గట్రా వేసుకుని కనిపించింది లేదు. కానీ, ఆ బహిరంగ సభలో జనసేనాని చేతికి పెద్ద సైజు ఉంగరం కనిపించింది. అదేమీ అందం కోసమో.. ఆడంబరానికో పెట్టుకున్న రింగ్ మాత్రం కాదు. అది.. జాతకరిత్యా ధరించిన ఉంగరం. మరి, పీకేకు జాతకాల పిచ్చి ఎప్పటి నుంచి?ఇదంతా త్రివిక్రమ్ చలవే అంటున్నారు సన్నిహితులు. పవన్‌కు మిగతా అందరికంటే త్రివిక్రమ్ అంటే చాలా గురి. ఆయన చెబితే వింటారు. ఆయన చెబితే ఆలోచిస్తారు. ఆయన రాసిస్తే చదువుతారు. ఆయన దర్శకత్వం చేస్తే నటిస్తారు. పవన్‌కు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వారిలో ఈమధ్య త్రివిక్రమ్ అందరికంటే ముందున్నారు. భీమ్లా నాయక్ హిట్‌తో ఆ బంధం మరింత ధృఢమైంది. ఆ సమయంలోనే పవన్ జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ ఆస్ట్రాలజిస్ట్.. పవన్ జాతకాన్ని పరిశీలించి.. దోషాలను సరి చేసే ప్రయత్నం చేశారని.. పగడపు ఉంగరం ధరిస్తే.. రాజకీయంగా కలిసొస్తుందని సూచించారని సమాచారం. ఇలా ఉంగరం పెట్టుకునేందుకు భీమ్లా నాయక్ మొదట్లో నిరాకరించినా.. త్రివిక్రమ్ పట్టుబట్టి మరీ.. ఉగరం పెట్టుకునేలా చేశారని అంటున్నారు. పగడం కనీసం 4 కారెట్ల బరువు ఉండాలనేది నిబంధన. అందుకే, ఆ రింగ్ అంత పెద్ద సైజులో ఉంది. పగడం అంత ఖరీదైనదేమీ కాదు. కేవలం అలంకరణ కోసమే అయితే.. ఏ డైమండ్ రింగో, జాతి రత్నమో పెట్టుకునేవారు పవన్. అంత పెద్ద పగడపు ఉంగరం కేవలం జాతక దోషాల నివారణకే ధరిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి, ఆ రింగ్.. జనసేనానిని ఏపీ రాజకీయాల్లో రింగ్ మాస్టర్‌ని చేస్తుందా? ఆ ఉంగరం జగన్‌రెడ్డి సర్కారును గింగిరాలు తిప్పుతుందా? పవన్‌ను గద్దె నెక్కిస్తుందా? ఉంగరంతో పీకే జాతకం ఎలా మారనుందో చూడాలి.....