YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది నిర్వాకం.

కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది నిర్వాకం.

కర్నూలు, మార్చి 17,
ఎవరైనా పన్నులు కట్టకపోతే ఒకటికి రెండుసార్లు చెల్లించాలని యజమానులకు చెబుతారు. ఎక్కువ ఫైన్ పడుతుందని హెచ్చరిస్తారు. ఈ క్రమంలో చెత్త పన్ను కట్టలేదని కర్నూలు నగరపాలక  సిబ్బంది చేసిన నిర్వాకం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల వద్దకు వెళ్లిన నగరపాలక సంస్థ సిబ్బంది.. దుకాణాల ముందు చెత్త వేసి వెళ్లిపోయారు. నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లారు. ఆస్తి, నీటి పన్ను, దుకాణాలకు ట్రేడ్ లైసెన్సుల రుసుము చెల్లిస్తున్నామని దుకాణాదారులు చెప్పారు. మళ్లీ ఈ చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ సమాధానంలో సహనం కోల్పోయిన నగరపాలక సంస్థ సిబ్బంది.. నగర వ్యాప్తంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్లో తీసుకొచ్చి దుకాణాల ముందు పడేసి వెళ్లారు. ఈ ఘటనతో సంబంధిత దుకాణాల యజమానులు అవాక్కయ్యారు. పన్ను చెల్లించకపోతే ఇలా చేస్తారా అని అసహనం వ్యక్తం చేశారు.నెలకు రూ.200 చెత్తపన్ను కట్టలేమని దుకాణదారులు అంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా చెత్త పన్ను వసూలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి విచిత్రమైన పన్నులు వసూలు చేస్తున్నారని వాపోయారు. సిబ్బంది తీరుతో చాలా అవమానంగా ఉందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల పన్ను ఒకేసారి కట్టాలని తమపై ఒత్తిడి తెచ్చారని, దీనిపై సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్‌తో మాట్లాడతామన్నా సిబ్బంది వినలేదని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు చెత్త పన్ను కట్టకపోతే ఈ విధంగానే ఉంటుందని సిబ్బంది దుకాణ యజమానులతో చెప్పడం గమనార్హంఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుకూలంగా తీర్మానించిన పట్టణ స్థానిక సంస్థల్లో అమలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రుసుముల వసూళ్ల బాధ్యతను వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. కొన్నిచోట్ల అన్ని వార్డులు/డివిజన్లలో, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా రుసుముల వసూళ్లకు సిద్ధమయ్యారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా ఇళ్లు, వాణిజ్య సంస్థల్లో రోజూ చెత్త సేకరించినందుకు వినియోగ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీ పాలకవర్గాల్లో మొదట భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్నులు విధించాలన్న నిర్ణయంపై ప్రజల్లో అప్పటికే ఆందోళన వ్యక్తం కావడంతో చెత్త సేకరణపై రుసుముల అంశాన్ని పాలకవర్గాలు పలు చోట్ల వాయిదా వేశాయి. ప్రతిపాదనలను ఆమోదించాల్సిందేనని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లడంతో మొదట వ్యతిరేకించిన చోట మళ్లీ పాలకవర్గాలు సమావేశమై అనుకూలంగా తీర్మానించాయి.

Related Posts