తమిళనాడులో గవర్నర్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ మంత్రాంగం నడిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సీన్ కర్ణాటకలో రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు కొంచెం దూరంలోనే ఆగిపోయిన బీజేపీ... సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది, ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తొలి అవకాశం తమకే కల్పించాలని గవర్నర్ విజుభాయ్ వాలాకు విన్నవించనుంది.మరోవైపు, గవర్నర్ ను కలిసేందుకు కాంగ్రెస్ పత్రినిధి వర్గం ప్రయత్నించింది. అయితే, వారికి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కలవడం కుదరదని ఆయన స్పష్టమైన సమాచారాన్ని కాంగ్రెస్ నేతలకు ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత, ఎన్నికల కమిషన్ ఇచ్చే సమాచారం ఆధారంగానే తాను నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పినట్టు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో వీరు నిరాశతో వెనక్కి వచ్చేశారు. ఈ బృందంలో పరమేశ్వర, మధు యాష్కీలు కూడా ఉన్నారు.
కాసేపట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా రాజీనామాను సమర్పించడమే కాకుండా, జేడీఎస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం.