న్యూఢిల్లీ,మార్చి 17,
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అంత సులభం కాదని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి మొత్తం ఎమ్మెల్యేల్లో సగం కూడా లేరని సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశవ్యాప్తంగా విపక్షాలకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా మద్దతు లేకుండా బీజేపీ ముందుకు సాగరు అని మమతా బెనర్జీ అన్నారు. దీన్ని బీజేపీ నేతలు మరచిపోకూడదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మమతా బెనర్జీ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై పోరాడేందుకు అన్ని విధాల సిద్ధమవుతున్నామని మమతా బెనర్జీ అన్నారు. తాజాగా, తృణమూల్ బాస్ హిల్స్ అండ్ హోమ్ అఫైర్స్ బడ్జెట్ చర్చ సందర్భంగా అసెంబ్లీలో పలు వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ… తమ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కొందరు కావాలనే ప్రతి విషయాన్ని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇంకా గేమ్ అయిపోలేదని, పెద్దగా మాట్లాడకూడదని మమతా బెనర్జీ అన్నారు. గతంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు పరాజయం పాలైనప్పటికీ బలమైన స్థితిలో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.ఇదిలావుంటే, రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 1971 జనాభా ప్రాతికదిక ఫార్మూలాను ఎన్నికలను నిర్వహిస్తారు. ఇటు బీజేపీ కూడా రాష్ట్రపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రపతిని 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 లోక్‌సభ సభ్యులతో కలిపి 776 మంది పార్లమెంట్ సభ్యులు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,896 మంది కూడిన ఎలక్ట్రోల్ కాలేజీ ఎన్నుకోనుంది. మొత్తం ఎలక్ట్రోల్ కాలేజ్‌లో ఓట్ల సంఖ్య 10,98,903 కాగా.. ఇందులో బీజేపీ బలం సగం కంటే ప్రాంతీయ పార్టీల బలమే ఎక్కువే ఉంది. ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 కాగా.. ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతుంది. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208. మొత్తంగా చూస్తే ఇందులో 50 శాతం+1 ఓటు వచ్చిన వారు రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు.