న్యూఢిల్లీ, మార్చి 17,
కరోనా మహమ్మారి పుట్టిల్లు చైనా మరోసారి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చైనాలోని అనేక ప్రాంతాల్లో ‘స్టెల్త్ ఒమిక్రాన్’ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం 13 నగరాల్లో కఠిన ఆంక్షలు విధించింది. మధ్య చైనా సహా షాంఘై పరిసర ప్రాంతాలు, ఇండస్ట్రియల్ సిటీ చాంగ్ చున్ లో భారీ ఎత్తున కొత్తగా కరోనా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ విధించింది. దీంతో 3 కోట్ల మంది లాక్ డౌన్ లో చిక్కుకుపోయి విలవిలలాడుతున్నారని సమాచారం వస్తోంది. చైనాలో రెండేళ్ల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానివ్వకూడదనే వ్యూహంతో రెండేళ్లుగా కట్టడి చేసింది. అయినా.. స్టెల్త్ ఒమిక్రాన్ డ్రాగన్ కంట్రీని ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం గమనార్హం. నిజానికి 2020 ఫిబ్రవరి 12న చైనాలో అత్యధికంగా సుమారు 15 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి రోజున 5 వేల 90 కేసులు బయటపడ్డాయి. 2019లో చైనాలోని వూహాన్ లో కరోనా కేసులు వెలుగు చూసినప్పటి నుంచీ ఇంత వరకు ఆ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే.. ఇప్పుడు మళ్లీ అంతకు మించి స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో చైనా సర్కార్ 13 పెద్ద నగరాలను మూసేసింది. దీంతో ఆయా నగరాల్లో నివసిస్తున్న 3 కోట్ల మందికి పైగా బలవంతంగా లాక్ డౌన్ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. లాక్ డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కోవిడ్ కారణంగా ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది. జిలిన్, చాంగ్ చున్, షెన్ ఝెన్, షాంఘై, లాంగ్ ఫాంగ్ నగరాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. ప్రజలకు భారీ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీజింగ్ నగరంతో పాటు షాంఘైకి విమానాల రాకపోకలు రద్దయిపోయాయి. మరో పక్కన లాక్ డౌన్ ను సడలించే అవకాశాలు సమీపంలో కనిపించని పరిస్థితులు చైనా నగరాల్లో నెలకొన్నాయి.చైనాను వణికిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్ అంటే ఏమిటని ఇంటర్ నెట్ లో ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తుండడం గమనార్హం. స్టెల్త్ ఒమిక్రాన్ కు అత్యధికంగా సంక్రమించే శక్తి ఉంటుందని వైద్య నిపుణులు నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కు ఉపరకమై ‘బీఏ 2’ను స్టెల్త్ ఒమిక్రాన్ అని పేరు పెట్టారు. కరోనా థర్డ్ వేవ్ కు కారణమైన ఒమిక్రాన్ మూలకారకం కంటే స్టెల్త్ ఒమిక్రాన్ ఒకటిన్నర రెట్లు వేగంగా వ్యాపిస్తున్నదని వైద్య నిపుణులు గుర్తించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఈ వేరియంట్ ను నిర్దిష్టంగా గుర్తించేందుకు కావాల్సిన స్పైక్ ప్రొటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు స్టెల్త్ ఒమిక్రాన్ లో లేవట. దీంతో దీన్ని గుర్తించడం కూడా కష్టతరం అవుతోందని తెలుస్తోంది.ఏదేమైనా కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని భావించి, ప్రయత్నాలు చేస్తున్న డ్రాగన్ కంట్రీకి స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ తలబొప్పి కట్టిస్తోందంటున్నారు. కరోనాను ప్రపంచం మీదకి వదిలిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయని, డ్రాగన్ కంట్రీలో ఈ వేరియంట్ దడ పుట్టిస్తోందని చెబుతున్నారు.నిజానికి వింటర్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత చైనాలో ఆంక్షలు సడలించారు. దీంతో ఒక్కసారిగా జనసంచారం పెరిగిపోయింది. అందువల్లే స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతుండడం గమనార్హం. దాదాపు కోటి జనాభా ఉన్న టెక్ హబ్ షెంజెన్ లో ఆరుబయట మనిషి కనిపించని పరిస్థితి ఉంది. లాక్ డౌన్ తో ప్రజలపై ఆర్థికంగా కూడా భారం పెరిగిపోతున్నట్లు సమాచారం. కరోనా కారణంగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున పతనమైంది. షాంగైలో లాక్ డౌన్ నిబంధన కఠినంగా అమలవుతోంది. స్టెల్త్ ఒమిక్రాన్ ఇంత పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నా మరణాలు ఏవైనా సంభవిస్తున్నాయా? లేదా అనే దానిపై డ్రాగన్ కంట్రీ నోరు విప్పకపోవడం విశేషం.