హైదరాబాద్, మార్చి 17,
ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్కకు వల విసురుతున్నారా? ఆయన్ని తమ వైపుకుకు తెచ్చుకునేందుకు, ‘ఆకర్ష్’ అస్త్రాన్ని సందిస్తున్నారా, అంటే, అందరి నోటా అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, ఇప్పుడు కాదు, హుజురాబాద్’ ఓటమికి ముందు నుంచే కేసీఆర్’ అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలోనూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. దళిత బంధు సన్నాహక సమావేశానికి, భట్టిని ప్రత్యేకంగా ఆహ్వానిచ్చారు.ఇన్నేళ్ళలో మొదటి సారిగా ప్రతిపక్ష నేతకు ప్రగతి భవన్’లోకి ఎంట్రీ లభించింది అదే విధంగా దళిత బంధు పైలట్’ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసిన నాలుగైదు మండలాల్లో భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ఒక మండలాన్ని కూడా చేర్చారు. ఒక దశలో ముఖ్యమంత్రి కేసేఅర్, సీఎల్పీ నేతకు డిప్యూటీ సీఎం పోస్టును ఆఫర్ చెశారనే ప్రచారం జరిగింది. ఆదలా ఉంటే ఇప్పుడు తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కపై ప్రశంసల జల్లు కురిపించారు. మంత్రి తలసాని శ్రీవాస యాదవ్, కాంగ్రెస్ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మధ్య సాగిన మాట్ల యుద్ధంలో జోక్యం చేసుకున్న మంత్రి కేటీఆర్ ఓ వంక కాంగ్రెస్ సభ్యుని దుమ్మెత్తి పోస్తూనే, మరోవంక సిఎల్పీ నేతను ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవంక ముఖ్యమంత్రి కేసీఆర్, అసెంబ్లీలో భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ చేసిన ప్రసగాన్ని మెచ్చుకున్నారు. ఆయన ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా తూర్పారా బట్టవచ్చని, ఎంపీ కావాలని కోరుకుందామన్నారు. అంతే, కాదు ఆయన ఒకే అంటే, త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒక సీటు భట్టికి రిజర్వు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని, తెరాస వర్గాల్లో వినవస్తోంది.అలాగే, ఆయనకు ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో అదే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ విషయంలోనూ ముఖ్యమంత్రి ఇలాగే వలవేసి, తమ బుట్టలో వేసుకున్నారని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో తెరాస రోజు రోజుకు బలహీనమవుతున్న నేపధ్యంలో భట్టి విక్రమార్క వంటి గట్టినేతను పార్టీలోకి తెచ్చుకోవడం తెరాసకు అవసరమని అందుకే ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ పోటా పోటీగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారని అంటున్నారు. అయితే భట్టి విక్రమార్క ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారు. అంతే కాకుండా, ముఖ్యమంత్రి ఫ్రెష్’గా ఎంపీ వల విసరిన తర్వాత కూడా ఆయనలో మార్పు వచ్చినట్లు లేదు. తాజాగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకోవటం చాలా అవసరమని సీఎల్పీ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశ సారాంశం కూడా ఇదేనని తేల్చారు. దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామ రక్షా అని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సో .. కేసీఆర్, కేటీఆర్ వ్రతం చెడినా ఫలితం మాత్రం దక్కలేదని పరిశీలకులు భావిస్తున్నారు.