హైదరాబాద్, మార్చి 17,
దేశ రాజధాని ఢిల్లీని ఎలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ విక్టరీతో జాతీయ పార్టీగా అవతరించేందుకు అడుగులు వేస్తోంది. ఈ విజయంతో పార్టీ విస్తరణకు మరింత ఊతం లభించనట్లైంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి జోష్ ఉన్న ఆప్.. ఇప్పుడు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు ఫోకస్ పెట్టింది. రానున్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పబోయేది తామేనని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులను సిద్ధంచేస్తోంది ఆప్. స్థానిక ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోరాటాలకు సిద్ధం కావాలని కేడర్‌కు సంకేతాలు ఇచ్చేసింది.అవినీతి వ్యతిరేక పోరాటయాత్రతో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయాణం ముందుకు సాగుతోంది. మొదట దేశ రాజధాని ఢిల్లీలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన పని ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందారు. ఇప్పుడు మరో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్సాహం మరింత బలపడుతోంది. దీంతో అధిష్టానం కూడా పార్టీ విస్తరణకు వ్యూహరచన చేయడం ప్రారంభించింది. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఆప్ ఇప్పుడు తన అడుగులు పెంచుతోంది. ఇందులోభాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత, ఆప్ ఇప్పుడు ప్రధానంగా గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను టార్గెట్ చేసింది. వీటిలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల బోర్డు వేసే పనిలో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రచారం జోరందుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎదగాలని భావిస్తున్నప్పటికీ, ఇక్కడ ఆప్‌కి పెద్దగా ఆదరణ లభించలేదని, గత అనుభవాలు చెబుతున్నాయి. 2018లో జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆప్ ప్రయత్నించినా ఖాతా తెరవలేకపోయింది. అయితే, దక్షిణాదికి ముఖ్య కేంద్రమైన తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆప్ అధినాయకత్వం భావిస్తోంది.దక్షిణాదిలో కీలకంగా ఉన్న తెలంగాణపై ఆప్ అధినేత కేజ్రీవాల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి కేంద్రీకరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతోంది. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రక్రియ ఈ రాష్ట్రం నుంచే ప్రారంభమవుతుంది. ముందుగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ నుంచి పాదయాత్రను పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో పాదయాత్ర చేపడుతున్నట్లు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి తెలిపారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీని కూడా ప్రజలకు మరింత దగ్గర చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు అకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో మా టీమ్‌కు లభిస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని, ప్రజల వైఖరిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో సభ్యత్వ డ్రైవ్ ద్వారా పార్టీని విస్తరించాలని నిర్ణయించింది. ముందుగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలలో తొలుతు పార్టీని విస్తరించి ఆతరువాత గ్రామాలకు విస్తరించాలనే ఫ్లాన్ తో ముందుకెళుతోంది.ఇప్పుడు ఆప్ నేతలు కూడా .. పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువైయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఆప్ లక్ష్యాలను ఇంటింటికి తీసుకెళ్తామని సోమనాథ్ భారతి తెలిపారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వ పాలనా నమూనాను ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి తీసుకువెళతామని చెబుతున్నారు. విద్యుత్, నీరు, పాఠశాలలు, ఆసుపత్రుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఎన్నికల పోరాటం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పాలన వైపల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు టర్మ్‌లు చేసిన నేపథ్యంలో సహజంగా వచ్చే వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అలాగే, కాంగ్రెస్‌పై ఆశలు సన్నగిల్లడం, బీజేపీ హిందుత్వ ఏజెండాకు పూర్తి స్థాయిలో అనుకూలత లేకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణపై ఫోకస్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఉద్దృతం చేస్తామని ఆప్ నేత సోమనాథ్ భారతి తెలిపారు. ముందుగా అర్భన్ సెక్టార్‌లో అప్ తన ఇమేజిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టనున్న పాదయాత్ర ప్రారంభం కాగానే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో లోకల్ ప్లెవర్ కోసం ఇందిరా శోభన్‌ను పార్టీ నిర్వహకురాలిగా నియమించిన ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 60స్థానాల్లో పోటీకి రెడీ అవుతోంది.మొత్తం మీద రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉహాగానాల నేపథ్యంలోనే సంవత్సరం ముందు నుంచే పోలిటికల్ హీట్ పెరిగింది. దీంతో అన్ని పార్టీలు తమ కార్యకర్తలను, నేతలను సన్నద్దం చేస్తున్నాయి.