కర్ణాటక రాజకీయం రాజ్‌భవన్‌లో కీలకమలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటులో ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(104)తరఫున యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్ గవర్నర్‌ను కలిశారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి 7 రోజుల గడువు ఇచ్చారు. వారంలోగా కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. బలనిరూపణకు గవర్నర్ వారం రోజుల గడువునిచ్చారు.అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి యడ్యూరప్ప ప్రయత్నాలు మొదలెట్టారు. కింగ్‌మేకర్‌గా మారిన జేడీ(ఎస్)ను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. దేవెగౌడ పెద్దకొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రేవణ్ణ వర్గానికి 12 మంది జేడీ(ఎస్)లో ఎమ్మెల్యేల మద్దతు ఉంది. చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు.అంతకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే జేడీఎస్ గవర్నర్‌కు లేఖ కూడా రాసి అపాయింట్‌మెంట్ కోరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి జేడీఎస్ నేత కుమారస్వామి కాసేపట్లో గవర్నర్ వద్దకు వెళుతుండగా, మరోవైపు యడ్యూరప్ప ఇప్పటికే రాజ్‌భవన్ చేరుకుని గవర్నర్‌ని కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ను కలిసి కాసేపు చర్చించారు. రాష్ట్రంలో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని, అతి పెద్ద పార్టీగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు చెప్పారు. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.