YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పుష్ప శ్రీ వాణికి గడ్డు కాలమేనా

పుష్ప శ్రీ వాణికి గడ్డు కాలమేనా

విజయనగరం, మార్చి 19,
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై పొలిటికల్ బాంబ్ పడబోతోందా? పుష్పశ్రీవాణి సొంత ఆడపడుచు పల్లవిరాజు టీడీపీలో చేరడంతో పాటు కురుపాం నియోజకవర్గంలో ఆమెనే ఢీకొనబోతున్నారా? అంటే.. అవుననే అంచనాలే వస్తున్నాయి.
ఏపీలో తొలిసారి ఎన్నికైన 50 మంది ఎమ్యెల్యేల తీరుపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీక్రెట్ సర్వే చేయించి, వచ్చిన నివేదికతో వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేలపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో పక్కన తన కేబినెట్ లోని కొందరు మంత్రులకు ఉద్వాసన చెప్పి, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు. సీక్రెట్ సర్వే నివేదికలో.. లేదా ఆ ఎనిమిది మహిళా ఎమ్మెల్యేల్లో, లేదంటే మంత్రి పదవి ఊడిపోయే జాబితాలో తన పేరు ఉందేమో అనే టెన్షన్ లో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఉన్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి.దీనికి తోడు పులిమీద పుట్రలా పుష్పశ్రీవాణికి ఇంటిలోనే పొలిటికల్ వార్ మొదలైంది. ఆమె ఆడపడుచు పల్లవిరాజు టీడీపీలో చేరుతున్నానని ప్రకటించడంతో పుష్పశ్రీవాణి బెర్త్ కు షాక్ తగిలే అవకాశాలున్నాయంటున్నారు. పుష్పశ్రీవాణి భర్త, అరకు పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజుకు పల్లవిరాజు సొంత సోదరి. వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదని, మన్యం ప్రజల సమస్యలను జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదనేది తాను పార్టీ మారి టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడానికి కారణమని ఆమె చెబుతుండడం విశేషం. ఏజెన్సీకి సంబంధించిన ఏదైనా సమస్యపై సీఎంను కలవాలనుకుంటే జగన్ రెడ్డి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదనే బాధతో పల్లవిరాజు రగిలిపోతున్నారు. కనీస గౌరవం కూడా ఇవ్వని వైసీపీలో తాము ఇకపై కొనసాగే పరిస్థితి లేదని, అందుకే పార్టీని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వెల్లడించడం గమనార్హం. ఇంట్లోనే డిప్యూటీ సీఎం ఉన్నా తమకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదనేది ఆయన ఆరోపణ. అందుకే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించడం గమనించదగ్గ విషయం. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు తన కొడుకు పరీక్షిత్ రాజునే కాకుండా కుమార్తె పల్లవిరాజును కూడా తన రాజకీయ వారసురాలిగా ప్రకటించడం గుర్తుంచుకోవాల్సిన అంశం.కురుపాం నియోజకవర్గం గిరిజనుల చిరకాల స్వప్నమైన లాబేసు- పూర్ణపాడు వంతెన, నాగావళి వంతెనల నిర్మాణం గురించి సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పల్లవిరాజు, చంద్రశేఖర్ రాజు గుర్రుగా ఉన్నారంటున్నారు. వర్షాకాంలో కురుపాం ప్రజలు పడుతున్న కష్టాలు కళ్లారా చూస్తున్నామని, ఈ వంతెనల విషయం ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు సీఎం, జగన్ పెడచెవిన పెట్టడం పల్లవిరాజు, చంద్రశేఖర్ రాజు భరించలేకపోతున్నారు. తమ వదిన, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అయినా ఈ సమస్యల గురించి పట్టించుకున్నారా అంటే అదీ లేదని పల్లవిరాజు కోపంగా ఉన్నారట. వైసీపీకి రాంరాం చెప్పేసి, టీడీపీలో చేరాలనే తమ నిర్ణయానికి పల్లవిరాజు మరికొన్ని స్థానిక కారణాలు కూడా చెబుతుండడం గమనార్హం. గిరిజన సంక్షేమ హాస్టల్ లో పాము కరిచి విద్యార్థి చనిపోతే నష్టపరిహారమైనా ప్రకటించకుండా జగన్ రెడ్డి సర్కార్ దున్నపోతు మీద నీళ్లు పడ్డ చందంగా వ్యవహరించిందని ఆమె ఆరోపిస్తున్నారు. గొప్పగా తెచ్చిన దిశ చట్టం బిల్లును పార్లమెంట్ లో పాస్ చేయించుకోలేని దుస్థితిలో వైసీపీ సర్కార్ ఉండడం సిగ్గుచేటు అంటున్నారు పల్లవిరాజు. ఇలాంటి అనేక విషయాల్లో జగన్ రెడ్డి సర్కార్ విఫలం అవడంతో తాము టీడీపీ తీర్థం తీసుకుంటున్నట్లు వెల్లడించడం విశేషం.మొత్తం మీద పల్లవిరాజు వైసీపీకి గుడ్ బై చెప్పేసి, టీడీపీలో చేరి, వచ్చే ఎన్నికల్లో కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే.. వదినా మరదళ్ల మధ్య రసవత్తరమైన రాజకీయ పోరు జరిగే చాన్స్ ఉందంటున్నారు. నిజానికి కురుపాం నియోజకవర్గం నుంచి పల్లవిరాజుకు టీడీపీ టికెట్ ఇస్తామనే హామీ ఇప్పటికే వచ్చిందనే ప్రచారం జరుగుతుండడం విశేషం. మామ చంద్రశేఖర్ రాజు, ఆడపడుచు పల్లవిరాజు టీడీపీలో చేరితే పుష్పశ్రీవాణికి రాజకీయంగా గడ్డుకాలం తప్పకపోవచ్చని పొలిటికల్ పండితులు చెబుతున్నారు.

Related Posts