విజయవాడ, మార్చి 19,
ఒకే కుటుంబంలో ఇద్దరో ముగ్గురో, రాజకీయాలలో ఉండడం సర్వ సాధారణం. అదే విధంగా వారసత్వ రాజకీయాలు మనకు కొత్త కాదు. గాంధీ నెహ్రూ ఫ్యామిలీ మొదలు కేసీఆర్ కుటుంబందాకా దేశ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు, రాజకీయ కుటుంబాలుగా చెలామణి అవుతున్నాయి, చక్రం తిప్పుతున్నాయి. అలాగే, ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీలలో ఉండడం కూడా కొత్త కాదు. కానీ, ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మూడు, రాజకీయ కుంపట్లు రాజేయడం, ఎవరికి వారు సొంత పార్టీలు స్థాపించడం మాత్రం, బహుశా ఇదే మొదటిసారి కావచ్చును. అవును మనం ఇప్పుడు మాట్లాడుతోంది, ఎవరిగురించో కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ గురించే మనం మాట్లాడుకుంటున్నాము. వైఎస్ చనిపోయిన అనంతరం ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విబేధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నత కాలం,ఫ్యామిలీ మొత్తం ఒకటిగా ఐక్యంగానే వుంది.అంతే కాదు జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళిన సమయంలో 16 నెలల పాటు, జగన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీని బతికించారు. జగన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్రను షర్మిల కొనసాగించారు. ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ దూసుకు పోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి తల్లి విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు.అయితే, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోదరి షర్మిల మధ్య కలహాల కుంపటి రాజుకుంది. అలా రాజుకున్న కుంపటి ఇప్పుడు భగ్గు మంటోంది. షర్మిల, పుట్టింటి నుంచి అత్తింటికి చేరారు. తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ లక్ష్యంగా వైసీపీ టీపీ పేరిట సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. షర్మిల, ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు, అనే విషయంలో అనేక ఉహాగానాలు వినిపించినా,అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే జరిగిన జరుగతున్న పరిణామాలను గమిస్తే, అన్న జగన్ రెడ్డితో విబేధాలే ఆమె పార్టీ ఏర్పాటుకు మూల కారణంగా కనిపిస్తోందని, అంటున్నారు. అయితే, ఇవి కేవలం రాజకీయపదవులకు సంబదించిన విబేధాలు మాత్రమేనా లేక ఆస్తుల వివాదాలు, క్రైస్తవ సంస్థల నుంచి అందున్నవిదేశీ విరాళాల వాటాల విషయంలో తలెత్తిన వివాదాల అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఉంటే, అన్నా చెల్లికి తోడు, ఇప్పుడు బావ బ్రదర్ అనీల్ మూడో పార్టీతో ముందుకొచ్చారు. బామ్మర్ది పాలనలో క్రైస్తవులకు, బీసీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందని అంటూ, ‘బీసీ’ ముఖ్యమంత్రి నినాదంతో మరో పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ సంఘాలతో పాటు క్రైస్తవుల ప్రాధాన్యం గల ఎస్సి, ఎస్టీ, బిసి సంఘాల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో సమావేశాలు జరిపారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు వైసీపీ విజయానికి కృషి చేశారని, అయినా జగన్ రెడ్డి వారిని విస్మరించారని, అనిల్ ఆరోపించారు, అంతే కాదు, అప్పుడు వాళ్ళు నా మాట విన్నారు, ఇప్పుడు నేను వారి మాట వినక తప్పదు అంటూ, రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేందుకు రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుదామని బ్రదర్ అనిల్‌కుమార్ పిలుపు ఇవ్వడం గమనిస్తే ఇంట్లో తలెత్తిన ఆధిపత్య పోరాటం వీధులలోకి వస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని అంటున్నారు. అంతే కాకుండా, క్రైస్తవ్ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ డైరెక్ట్’గా రాజకీయ అరంగేట్రం చేయడంతో,ఇంకొన్ని కొత్త అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.