విజయవాడ, మార్చి 19,
మూడు రాజధానులపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరపాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా ఈ దిశగా సంకేతాలు పంపుతోంది. అసెంబ్లీలోనే మంత్రి బొత్స ఈ అంశంపై సమగ్ర చర్చ జరుపుతామని ప్రకటించారు. అదే సమయంలో 21వ తేదీన మూడురాజధానుల బిల్లు పెట్టబోతున్నారని ఇతర వర్గాల ద్వారా మీడియాకు సమాచారం ఇప్పించారు. సీఎంతో భేటీ అయిన మూడు రాజధానుల ఉద్యకారులు బయటకు వచ్చి అదే ప్రకటన చేశారు. దీంతో అసెంబ్లీలో చర్చ జరపడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు రాజధానుల బిల్లును మళ్లీ పెట్టడానికి ప్రభుత్వానికి రైట్ లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఇప్పుడు మళ్లీ అదే అంశంపై చర్చ పెట్టడం అంటే న్యాయవ్యవస్థతో ఘర్షణకు దిగినట్లే. దీనికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు హైకోర్టుల్లో వీగిపోతున్నా.. ఎక్కడా తగ్గడం లేదు. మూడురాజధానుల పై హైకోర్టు తీర్పు తర్వాతా.. వైసీపీ నేతలు అనేక మంది అనేకరకాలుగా స్పందించారు. వైసీపీ నేతలు మాత్రం తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామన్నారు. అసెంబ్లీలో మళ్లీ బిల్లు పెడితే.. చర్చించి ఆమోదిస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. హైకోర్టు తీర్పు నచ్చకపోతే ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్తారు. కానీ అలా చేయకుండా నేరుగా కోర్టును ధిక్కరించాలనుకుంటే రాజ్యాంగంతో గొడవపడినట్లే అవుతుంది. దానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే జరిగితే ముందు ముందు ఏపీలో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.