ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న చాపర్‌ను కాస్‌గంజ్‌లోని పొలాల్లో పైలట్ అత్యవసరంగా దింపేశాడు. సీఎం హెలికాప్టర్‌ను కాస్‌గంజ్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయ పాఠశాలలో దింపడానికి హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా.. హెలికాప్టర్‌లో ఏర్పడిన సమస్య కారణంగా అత్యవసరంగా కిలోమీటరు దూరంలోనే దింపేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని హోం శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లక్నోలో తెలిపారు. తాను పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో సీఎం యోగి యథావిధిగా పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. కాస్‌గంజ్ జిల్లాలోని ఫరౌలి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సీఎం యోగి ఉదయం అక్కడికి బయలుదేరి వెళ్లారు. ప్రయాణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.