హైదరాబాద్, మార్చి 19,
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో రద్దీని తగ్గించేందుకు వాటర్ మిలన్, మస్క్ మిలన్, పొపాయ విక్రయ కేంద్రాలను ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ యార్డుకు తరలించారు. ప్రతి యేటా వీటి అమ్మకాలు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లోనే కొనసాగుతుండేది. అయితే వేసవిలో మామిడి సీజన్ ఊపందుకోవడంతో వాహనాల రద్దీ పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రద్దీని తగ్గించేందుకు ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ యార్డుకు వాటర్ మిలన్, మస్క్ మిలన్, పొపాయ విక్రయ కేంద్రాలను తరలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటర్ మిలన్‌లో దేశీ రకం పండ్ల సీజన్ మరో పది, పదిహేను రోజుల్లో ముగియనున్నందున వాటిని ప్రస్తుతానికి గడ్డిఅన్నారం మార్కెట్ యార్డులోనే కొనసాగిస్తున్నారు. మంగళవారం మార్కెట్ యార్డుకు 96వాహనాల్లో వాటర్ మిలన్, 32 వాహనాల్లో మస్క్ మిలన్, 27 వాహనాల్లో పొపాయ చేరుకోగా అమ్మకాలు కూడా జోరుగా సాగాయి.రాష్ట్రంలోనే అతిపెద్దదైన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులో కీలకమైన మామిడి కాయల సీజన్ ఊపందుకుంది. మార్కెట్‌యార్డుకు పెద్ద ఎత్తున మామిడి సరుకు చేరుకుంటుంది. మార్చి మొదటి వారంలో అంతంత మాత్రమే ఉన్న సరుకు ప్రస్తుతం పెద్ద ఎత్తున యార్డుకు చేరుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంతో పాటుగా ఖమ్మం, నల్గొండ, ఏపీలోని కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి మామిడి సరుకు వస్తున్నది. మంగళవారం సుమారు 198 వాహనాల్లో దాదాపు 450 టన్నుల బెనిషాన్ రకం మామిడి కాయలు యార్డుకు దిగుమతి కాగా వేలం అనంతరం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. మంగళవారం బెనిషాన్ రకం కాయలకు గరిష్టంగా టన్నుకు రూ.70 వేలు పలుకగా కనిష్టంగా రూ. 21వేలు పలికింది. ఇక మోడల్ ధర రూ. 30 వేలు పలికిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి