హైదరాబాద్, మార్చి 19,
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు పోవడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా, ఇదే మట్లాడుకుంటున్నారు. అదే సమయంలో, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, జంప్ జిలానీల గోడ దూకుళ్ళు కూడా జోరందుకునే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, తెరాస అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనే అధికార తెరాస అభుర్ధులను ఓడగొట్టేందుకు తమ అనుచరులను స్వతంత్ర అభ్యర్దులుగా బరిలో దించిన జూపల్లి, ఇక ఇప్పడు తెరాసకు గుడ్ ‘బై చెప్పేందుకు సిద్దమయ్యారు.అయితే ఆయన బీజేపీలోకి వెళ్తారా లేక కాంగ్రేస్ గూటికి చేరతారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. నిజానికి, ఒక దశలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలను బేరీజు వేసుకుని బీజేపీలో చేరేందుకు జూపల్లి సిద్దమయ్యారు. అయితే, తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు వచ్చిన స్పందన చూసిన తర్వాత ఆయన పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. అదలా ఉంటే నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కోమటి రెడ్డి సోదరులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.నిజానికి గతంలోనూ కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, బీజేపీలో చేరుతున్నామని బహిరంగంగా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సోదరులు ఇద్దరూ బీజేపీని తెగ పొగిడేస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన ఎంపీ, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, మోడీ ఆహా .. ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అడిగిన అరగంటకే అప్పాయింట్మెంట్ ఇచ్చారని, అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగానే, కోమటి రెడ్డి సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి అవినీతిని వెలికితీయాలని కోరారు.మరోవంక అసెంబ్లీలో తెరాస మంత్రులు తన మీద మూకుమ్మడి దాడి చేసిన సందర్భంలో సీఎల్పీ నెట్ భట్టి విక్రమార్క తనకు అండగా నిలలేదని అగ్రహంగ ఉన్న, రాజగోపాల రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, ఆగ్రహం వ్యక పరిచారు.అదే సమయంలో, కేసీఆర్’ను ఓడించే పార్టీలోకి వెళ్తానని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. రెడ్ను రోజులక్రితం చౌటుప్పల్’లో విలేకరులతో మాట్లాడుతూ,కేసీఆర్’ను ఓడించడమే తమ లక్ష్యమని అందుకోసం అవసరం అయితే పార్టీ మారేందుకు కూడా సిద్దమని అన్నారు.అలాగే రెండేళ్లుగా తాను పార్టీ మారే విషయమై ఎన్నో కథనాలు వస్తున్నాయని గుర్తుచేసిన ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని అందుకే, పార్టీ మారే ఆలోచన చేస్తున్నానని చెప్పారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీ కీలక నేతలే లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. దీంతో కోమటి రెడ్డి సోదరులు కమలంవైపు చుస్తున్నారని మరోమారు స్పష్టమైందని అంటున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డికి అడిగిందే తడవుగా, ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ ఇవ్వడంతో, అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే నని, ఇక ముహూర్తం ఖరారు కావడమే మిగిలిందని అంటున్నారు.