YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బాబుపై బండి పొగడ్తలు.. రీజన్ అదేనా

బాబుపై బండి పొగడ్తలు.. రీజన్ అదేనా

హైదరాబాద్, మార్చి 19,
ఓ వంక ఆంధ్ర ప్రదేశ్’లో ఎన్నికల పొత్తులపై చర్చ మొదలైంది. జనసేన అధినేత పవన్’ కళ్యాణ్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని, పార్టీ ఆవిర్భావ సభ వేదిక నుంచి చేసిన ప్రకటనపై రాజకీయ, మీడియా వర్గాల్లో బహుముఖ చర్చ జరుగుతోంది. మళ్ళీ మరోసారి మూడు పార్టీలు ( టీడీపీ, జనసేన, బీజేపీ) ఒకటవుతాయని, బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా, టీడీపీ, జనసేనల పొత్తు వరకు అయితే ఖరారైనట్లేనని, పవన్ కళ్యాణ్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారని, విశ్లేషకులు అంటున్నారు. అదలా ఉంటే, తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతపై చేసిన వ్యాఖ్యలు, ఏపీ ఎన్నికల పొత్తులపై కొత్త ఆలోచనలకు ఆస్కారం కలిపించేలా ఉన్నాయని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి ఏపీలో బీజేపీ, అధికార వైసీపీ’తో చీకటి ఒప్పందం చేసుకుందని, తెలుగు దేశం పార్టీ ఎప్పటి నుంచో అనుమానిస్తోంది. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను కేంద్రం చూసీచూడనట్లు ఉపెక్షిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.అందుకే, పవన్ కళ్యాణ్ చేసిన, ‘ఓట్ల  చీలిక ఉండదు’ ప్రకటన సంచలనంగా మారింది. ఆదలా ఉంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ ఆందోళన వేదిక నుంచి, తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న మత సంతుష్టీకరణ విధానాలపై విమర్శలు గుప్పించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్, పనిలో పనిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రస్తావన తీసుకువచ్చారు. ఆయన్ని ప్రశంశలతో ముంచెత్తారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో, మత ఘర్షణలనే మాట వినపడకుండా, శాంతి భద్రతలను గట్టిగా కంట్రోల్ చేశారని గుర్తు చేశారు. అలాగే, కాంగ్రెస్ హయాంలో అధికార పార్టీ అండ చూసుకుని రెచ్చి పోయిన, ఎంఐఎం నాయకులను చంద్రబాబు నాయుడు తమ పాలనలో  అదుపులో పెట్టారని అన్నారు.మాములుగా అయితే, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఉండదు కానీ, ఆంధ్ర ప్రదేశ్’లో పొత్తుల చర్చ జరుగుతున్న సమయంలో మాజీ మిత్ర పక్షం టీడీపీ అద్యక్షుడు,చంద్రాబాబును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగడ్తలతో ముంచెత్తడం, దేనికి సంకేతమనే చర్చకు ఆస్కారం ఇస్తోందని అంటున్నారు. నిజానికి, తెలుగు దేశం, బీజేపీల మధ్య సుదీర్ఘ బంధం ఉందని పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్’ను 1985లో  నాదెండ్ల భాస్కర రావు అప్రజాస్వామికంగా గద్దె దింపినప్పటినుంచే రెండు పార్టీల మధ్య బంధం ఏర్పడింది. మధ్య మధ్యలో విడిపోయినా మళ్ళీ కలుస్తూనే ఉన్నాయని,ఇప్పుడు మళ్ళీ మరో మారు రెండు పార్టీలు ఒకటైనా ఆశ్చర్య పోనవసరం లేదని, అంటున్నారు.  మరో వంక ఉభయ పార్టీల్లోనూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేయడం ఉభయ తారకంగా ఉంటుందనే అభిప్రాయమే బలంగా వినిపిస్తోంది. అయితే, పొత్తుల విషయంలో ఇప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేదని, బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.ప్రస్తుతానికి, బీజేపీ, జనసేన కూటమి కలిసి పనిచేస్తాయని, ఉద్యమాలలో కలిసివచ్చే పార్టీలను కలుపుకు పోవడానికి తమకు అభ్యంతరం లేదని, ఆయన అన్నారు. అలాగే, తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా పొత్తుల గురించి చర్చించేందుకు ఇంకా సమయం ఉందని అంటున్నారు. దీని బట్టి చూస్తే ఇరు పార్టీలలో ‘పొత్తుపొడుపు’ కు సుముఖత వ్యక్త మవుతున్నట్లు ఉందని పరిశీలకులు అంటున్నారు.

Related Posts