YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పక్కా ప్లాన్ తోనే వివేకా మర్డర్

పక్కా ప్లాన్ తోనే వివేకా మర్డర్

కడప, మార్చి 19 ,
కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నిందితులు గట్టి ప్రణాళికే వేసినట్లున్నారు. రాజకీయంగా తన ఎదుగుదలకు మోకాలడ్డుతున్న వివేకా అడ్డు తొలగించుకునేందుకు హత్య వెనుక సూత్రధారులు క్షణక్షణానికీ పకడ్బందీగా ప్లాన్ లు సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. వివేకాను ఈ భూమ్మీద లేకుండా చేసే క్రమంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరినీ వాడేసుకున్నారని అర్థం అవుతోంది. అది వివేకా మాజీ కారు డ్రైవర్ షేక్ దస్తగిరి కావచ్చు.. వివేకా పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి కావచ్చు.. వివేకా అంటే కోపంతో ఉన్న సునీల్ యాదవ్ కావచ్చు, ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి అయినా కావచ్చు.. ఇలా ఏ ఒక్కరితో పని పూర్తవుతుందో అలా అందర్నీ వాడేశారని, అందుకు కోట్లకు కోట్లు డబ్బు ఎరవేసినట్లు దస్తగిరి పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెల్లడవుతోందని అంటున్నారు. 2019 మార్చి 13, 14, 15 తేదీల్లోనే వివేకాకు స్పాట్ పెట్టేయాలని బలంగా నిర్ణయించుకున్నారట. ఈ విషయం వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే వివేకా హత్యకు ఎంత పకడ్బందీగా తారీఖులు, సమయాలతో సహా నిందితులు ప్లాన్ చేశారో అర్థం అవుతోంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి  2022 ఫిబ్రవరి 21న పులివెందుల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో ఏం ఉందంటే.. వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద నైట్ వాచ్ మన్ పి.రాజశేఖర్ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నట్లు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారట. వివేకానందరెడ్డికి నమ్మిన బంటు అయిన రాజశేఖర్ కానీ, వివేకా పెంపుడు కుక్క జిమ్మి కానీ ఉంటే తాము వేసిన వివేకా మర్డర్ ప్లాన్ అమలు చేయడం సాధ్యం కాదని డిసైడ్ అయ్యారట. అందుకే నైట్ వాచ్ మన్ రాజశేఖర్ కాణిపాకం వెళ్లే ఆ మూడు రోజుల్లోనే వివేకాను అంతం చేయాలని నిందితులకు ఆదేశించారట. దాంతో పాటు పెంపుడు కుక్క జిమ్మీని కూడా చంపేయాలని నిర్ణయించారట. అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని దస్తగిరితో, సునీల్ యాదవ్ తో, ఉమాశంకర్ రెడ్డితో ఎర్ర గంగిరెడ్డి చెప్పారట.వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో 2019 ఫిబ్రవరి 10నే ప్లాన్ రూపొందించినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం. అయితే.. వివేకా ఇంట్లోకి వెళ్లాలంటే నైట్ వాచ్ మన్ రాజశేఖర్, కుక్క జిమ్మి ఉంటే సాధ్యం కాదని తాను ఆ సందర్భంగానే ఎర్ర గంగిరెడ్డితో చెప్పినట్లు దస్తగిరి వెల్లడించాడట. అయితే.. వివేకా పీఏ కృష్ణారెడ్డితో మాట్లాడి, వాచ్ మన్ ను స్పాట్ లో లేకుండా చేస్తానని గంగిరెడ్డి దస్తగిరితో చెప్పాడట. ఇక మార్చి 1వ తేదీ నుంచి గంగిరెడ్డి వివేకా వెంటే ఉన్నాడని దస్తగిరి వెల్లడించాడు. వివేకా ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డికి, తనకు గంగిరెడ్డి సమాచారం చెప్పేవాడని తెలిపాడు. అంటే వివేకాను హత్య చేయడానికి చాలా రోజుల ముందు నుంచే ఓ క్రమబద్ధమైన ప్రణాళికతో నిందితులు ముందుకు వెళ్లినట్లు అర్థం అవుతోందంటున్నారు.వివేకానందరెడ్డిని చంపేయాలని ఎర్ర గంగిరెడ్డి చెప్పిన రెండు మూడు రోజుల తర్వాత సునీల్ యాదవ్ తనకు కోటి రూపాయలు ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పడం గమనార్హం. అంటే కోట్లాది రూపాయలు ఈ కేసులో చేతులు మారాయన్నది సుస్పష్టం అవుతోంది కదా. అంత డబ్బు ఎవరు ఇచ్చారని తాను సునీల్ యాదవ్ ను అడిగితే.. ఎర్ర గంగిరెడ్డికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇస్తే .. తనకు గంగిరెడ్డి ఇచ్చినట్లు చెప్పాడని తెలిపాడు. ఆ తర్వాత వివేకాను చంపాలా? వద్దా అని నిర్ధారించుకునేందుకు తాను సునీల్ యాదవ్ ను సంప్రదించానన్నాడు. ఆ తర్వాత తనను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ తీసుకెళ్లి, శివశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడట. శివశంకర్ రెడ్డి తనతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘ఎర్ర గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయండి.. మేం ఉన్నామని చెప్పాం కదా.. మళ్లీ అనుమానం ఎందుకు?’ అని ప్రశ్నించినట్లు చెప్పినట్లు దస్తగిరి చెప్పడాన్ని చూస్తే వివేకా హత్యలో ఒక్కొక్కరి ప్రమేయం ఎంతలా ఉందో చెప్పకనే చెబుతోందని అంటున్నారు. సీబీఐ చేతికి కేసు దర్యాప్తు వెళ్లింది. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి,తాను ఈశ్వరయ్యతోటలో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కలిశామన్నాడు దస్తగిరి. తమ పరిస్థితి ఏంటని అడిగామన్నాడు. ‘మేం చూసుకుంటాంలే.. ఇబ్బంది లేదు డబ్బులు ఏమైనా కావాలా?’ అని వారు అడిగారని చెప్పడం చూస్తుంటే.. కోటి రూపాయలు సునీల్ యాదవ్ తో పంపడమే కాకుండా ఇంకా ఎంత డబ్బయినా వెదజల్లేందుకు వారు రెడీ అయ్యారనే విషయం తేటతెల్లం అవుతోంది. సీబీఐ ఇచ్చిన నోటీసు తీసుకుని బయపురెడ్డి ఇంట్లో శివశంకర్ రెడ్డిని దస్తగిరి కలిశాడట. ‘సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా తమ పేర్లు బయటపెట్టొద్దు. కావాల్సినంత డబ్బిస్తాం. జీవితం సెటిల్ చేస్తాం’ అని చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో తెలిపాడు.ఢిల్లీలో సీబీఐ వారికి తాను నిజం చెప్పలేదని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత సీబీఐ అధికారుల విచారణలో చెప్పానని దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించడం గమనార్హం. తర్వాత భరత్ యాదవ్, శివశంకర్ రెడ్డి దస్తగిరిని కలిసి వాంగ్మూలంలో ఏం చెప్పావని ఆరా తీశారట. ప్రాణభయంతో తాను వారికి నిజం చెప్పలేదన్నాడు. ఆ తర్వాత ఓ రోజు అవినాష్ రెడ్డి తోట వద్దకు రమ్మంటూ తనను భరత్ యాదవ్ పిలిచినట్లు చెప్పాడు. భరత్ యాదవ్, పులివెందులకు చెందని లాయర్ ఓబుల్ రెడ్డి తనను హెలిప్యాడ్ దగ్గరకు రమ్మని పిలవడంతో తాను వెళ్లానని దస్తగిరి తెలిపాడు. ‘నువ్వు జడ్జి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం యధాతథంగా నాతో  చెప్పు’ అని ఓబుల్ రెడ్డి అడిగినట్లు చెప్పాడు. ఆ తర్వాత జాగ్రత్తగా మసులుకో.. అనవసరపు మాటలు మాట్లాడొద్దని ఓబుల్ రెడ్డి హెచ్చరించాడట. అంటే హత్య కుట్ర వెనుక ఉన్న పెద్దలెవరి విషయం బయటకు పొక్కినా దస్తగిరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే వార్నింగ్ లాయర్ ఓబుల్ రెడ్డి మాటల్లో ఉండడం గమనించదగ్గ విషయం. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని పులివెందులలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు లాయర్లు బహిర్గతం చేశారట. దీంతో భరత్ తన ఇంటికి వచ్చి మరీ.. ‘నువ్వు వాళ్ల మీద చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు.. వాళ్లు నిన్ను వదలరు. చంపేస్తారు.. చెప్పిందంతా అబద్ధమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పా’లని హెచ్చరించాడట. అంటే వివేకా హత్య కేసులో నిందితులు ఎంత పకడ్బందీగా పావులో కదిపారో చెప్పకనే చెబుతోంది. వివేకా హత్య కేసు కథ, స్క్రీన్ ప్లే మొత్తం కుట్ర వెనుక ఉన్న పెద్దల ప్రోద్బలంతోనే నడిచినట్లు అర్థం అవుతోందని అంటున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ తుది దశకు తీసుకొచ్చిందని తెలుస్తోంది. ఈ హత్య కేసులో పాత్రధారులు తెలిసినా.. సూత్రధారులు, కథ మొత్తం నడిపించిన వారెవరన్నదే తెలియాల్సి ఉంది. తెర వెనుక ఇంత కథ నడిపించిన వారెవరో సీబీఐ తేల్చేస్తుందా? అసలైన నిందితులపై చర్యలు ఉంటాయా? అనేది వేచి చూడాల్సి ఉంది.

Related Posts