హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో గల డిఎన్ కాలనీలో నూతన జైన మందిరం నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ మందిర నిర్మాణం కు అన్ని విధాలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మందిరం నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల విరాళాన్ని మంత్రి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పరంగా వచ్చి నివసిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇక్కడ నివసించే అందరిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలుగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భావించి ఆదరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జైన సమాజ్ ప్రతినిధులు జితేందర్ సేట్, అభిషేక్ సేట్, ఆర్కే జైన్, మోతీలాల్ బాల్ ఘాట్, ముఖేష్ చౌహాన్, రిదేశ్ జాగీర్దార్, యోగేష్ గాంధీ, తెరాస డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.